desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:06AM

ఒక్క క్లిక్‌ చాలు..!

కడప, ఆంధ్రజ్యోతి సిటీ

పురపాలక సంఘాల్లో భవన నిర్మాణాలకు అనుమతులను ఆన్‌లైన్‌లో మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది పక్కాగా అమలైతే కంప్యూటర్‌ ముందు కూర్చునే ఒక్క క్లిక్‌తో మనకు కావాల్సిన అనుమతులను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో భవన నిర్మాణానికి, లే అవుట్ల అనుమతులు తీసుకోవాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారులు చెప్పినంత డబ్బులిస్తేనే... టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులకు ఓకే అంటారు. లేకపోతే సవాలక్ష కొర్రీలతో అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తారు. పురపాలక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప అనుమతులు రాని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పురపాలికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల అవినీతిని నియంత్రించడంతో పాటు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. దీంతో ప్రజలు పురపాలక కార్యాలయాల చుట్టూ తిరగనక్కరలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలనే పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, పట్టణ ప్రణాళిక సంచాలకులు తిమ్మారెడ్డిలు సమావేశమై ఆన్‌లైన్‌లో అనుమతుల జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించి పురపాలకను దీనికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అన్ని ఓకే అయితే వారం రోజులలోపే ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు మంజూరు అవుతాయి. ఇప్పటి దాకా అనుమతులను నెల రోజులలోపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు , పులివెందుల జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల, బద్వేలు మున్సిపాలిటీలున్నాయి. కడపలో ఏడాదికి భవన నిర్మాణాల కోసం 1200 నుంచి 1400 దాకా దరఖాస్తులు అనుమతుల కోసం వస్తుంటాయి. జిల్లావ్యాప్తంగా 3 వేల పైగా అన్ని పురపాలకల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. నెల రోజులలోపు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వస్తే... వారంలోపే అనుమతులు వస్తాయి. అలాగే ప్లాన్‌ ఏ స్టేజీలో ఉండేది కూడా దరఖాస్తు దారునికి తెలిసిపోతుంది. మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
సాధ్యమేనా?
ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు మంజూరు చేయడం మున్సిపాలిటీల్లో సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టిమ్‌ (జీఐఎస్‌) ఉపయోగించుకొని అనుమతులు మంజూరు చేయాలన్నది పురపాలక శాఖ ఉద్దేశం. జీఐఎస్‌ ద్వారా పురపాలకల్లో ఉన్న భవన యజమాన్ని, అతను చెల్లించాల్సిన పనుల వివరాలు, భవన నిర్మాణం తదితర వాటిని తెలుసుకోవచ్చు. కడప కార్పొరేషన్‌లో జీఐఎస్‌ సిస్టం ఏర్పాటుకు టౌన్‌ ప్లానింగ్‌ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు ఇవ్వాలంటే తొలుత టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆటో క్యాడ్‌ తెలిసి ఉండాలి. బిల్డింగ్‌ ప్లాన్‌, లే అవుట్ల ప్లాన్‌లను ఆటో క్యాడ్‌ ద్వారా డ్రాయింగ్‌ వేయాలి. దీన్ని ఆన్‌లైన్‌ పొందుపరచాలి.
ఆటో క్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ పై అవగాహన ఉండాలి. టౌన్‌ ప్లానింగ్‌లోని సీపీ, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లతో పాటు ప్లాన్లు గీసే లైసెన్సుడ్‌ సర్వేయర్లకు ఆటోక్యాడ్‌ తెలిసి ఉండాలి. కడపలో 75 మంది లైసెస్సు సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం అయితే చాలా మంది టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో పాటు లైసెన్సు సర్వేయర్లకు, ఆటో క్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేనట్లు చెపుతున్నారు. వీరికి శిక్షణ ఇస్తేనే ఆన్‌లైన్‌ విధానం సక్సెస్‌ అవుతుందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. ఏమైనప్పటికీ ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వస్తేఅవినీతి బెడద తగ్గడంతో పాటు త్వరితిగతిన అనుమతులు వస్తాయి. అంతే కాకుండా ఫిర్యాదులు వచ్చినా అధికారులకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.