Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 02:19AM

న్యాయమూర్తిపై న్యాయవాదుల ఆగ్రహం..మంగళగిరి సివిల్‌ జడ్జిపై ఫిర్యాదు

గుంటూరు (లీగల్‌): గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దావులూరి శామ్యూల్‌ జాన్‌ పట్ల కోర్టులో మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి అనుచితంగా ప్రవర్తించారంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో అక్రమ ఆయుధాలకు సంబంధించి గురువారం ఓ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిఫెన్స్‌ న్యాయవాదిగా ఉన్న శామ్యూల్‌ జాన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి చిరంజీవులు మధ్య కొంత వివాదం జరిగింది. దీంతో శామ్యూల్‌ జాన్‌పై న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమించడమే కాకుండా శామ్యూల్‌ను అరెస్ట్‌ చేయాలంటూ సాక్షిగా బోన్‌లో ఉన్న పోలీస్‌ అధికారిని ఆదేశించడం, కోర్టుకు హాజరైన పోలీసులు శామ్యూల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో మంగళగిరి కోర్టులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో మంగళగిరి కోర్టుకు వెళ్లి శామ్యూల్‌ జాన్‌కు మద్దతుగా నిలిచారు. అనంతరం గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, జిల్లా బార్‌ అసోసియేషన్ల ఫెడరేషన్‌ చైర్మన్‌ ఇ.శాంతకుమార్‌, సీనియర్‌ న్యాయవాది వైకే తదితరుల ఆధ్వర్యంలో న్యాయమూర్తిపై శామ్యూల్‌ జాన్‌ మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.