Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 00:52AM

చైనాలో కాదు... చేలల్లో పర్యటించు

  •  సీఎం కేసీఆర్‌కు నాగం సూచన
  •  అవినీతికి ‘మిషన్‌ కాకతీయ’ సాక్ష్యం: యెన్నం 
హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కరువుతో రైతు ఆత్మహత్యలు నిరాటకంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో చైనా పర్యటనను మానుకొని చేలు, చెలుకల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని సీఎం కేసీఆర్‌కు బచావో తెలంగాణ మిషన్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సూచించారు. వెంటనే రాష్ట్రంలోని రైతులకు కరువు పింఛన్లు అందించి, పశువులకు గడ్డిసరఫరా చేసేందుకు ఫాడర్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చి మభ్యపెట్టేందుకే‘లక్ష కోట్లతో ప్రాజెక్టులు’ అని సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని మిషన్‌ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్‌లో రైతు ఆత్మహత్యలపై ఎందుకు చర్చ జరపలేదని ప్రశ్నించారు. కనీసం 15వేల కోట్లు ఖర్చుపెట్టినా రాష్ట్రంలో 27కు పైగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్న మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలను యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. వర్షాభావం లేని ఏ జిల్లాలో చెరువులు నిండాయో చూపించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వ అవినీతికి పూడిక తీసిన చెరువులు సాక్ష్యంగా నిలుస్తున్నాయనిఆయన అన్నారు.