Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 5 2015 @ 00:47AM

సమానాభివృద్ధితోనే సమైక్యత

సమాన అభివృద్ధే ఆంధ్రప్రదేశ్‌ విభజనకు దారితీసిందని మనం గుర్తిస్తున్నాం కనుక ఇకముందు ప్రతి అంశంలోనూ, ప్రతి విభాగంలోనూ సమాన అభివృద్ధి మన లక్ష్యం కావాలి. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం విభజిత ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రాంతాలుగా వర్గీకరించింది. వీటిల్లో మొదటిది- మూడు జిల్లాల ఉత్తరాంధ్ర; రెండోది- నాలుగు జిల్లాల రాయలసీమ; మూడోది- ఉత్తరాంధ్ర  పోనూ మిగిలిన ఆరు సర్కారు జిల్లాలు. ఈ ఆరు జిల్లాల మధ్యనే రాజధాని అభివృధ్ధి ప్రాంతం (సీఅర్‌డీఏ) వస్తుంది. రాజధానికి ఉత్తరాన ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను మధ్యాంధ్రగానూ, దక్షిణానవున్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణాంధ్రగానూ వర్గీకరించవచ్చు. ఈ ప్రాంతాల మధ్య, ప్రాంతాల్లోని జిల్లాల మధ్య, జిల్లాలలోని మండలాల మధ్య, మండలాలలోని గ్రామాల మధ్య, గ్రామాలలోని పేటలు, వాడల మధ్య, అందులోని సామాజికవర్గాల మధ్య సమాన అభివృద్ధిని సాధించినపుడే సమైక్యత నిజమైన అర్ధంలో వర్ధిల్లుతుంది. దాన్ని సాధించనంత వరకు ప్రజలు ప్రతి అంశాన్నీ అనుమానపు చూపుతోనే, అపోహలతోనే చూస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలు ఇబ్బందికరమే అయినా తప్పవు.

 
కొత్త ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అపోహలకు ద్వారాలు తీసిన తొలి ప్రాజెక్టు పట్టిసీమ. భారతదేశంలో నదుల అనుసంధానానికి నాంది పలికిన ప్రాజెక్టుగా పట్టిసీమ చరిత్ర సృష్టించినప్పటికీ, ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ రెండూ పాత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా అనేక కొత్త సందేహాలను సృష్టిస్తున్నాయి.
పట్టిసీమ ప్రాజెక్టులో రెండు దశలున్నాయి. మొదటిదశలో, గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకు 80 టీయంసీల నీటిని మళ్ళించి, ఆ మేరకు కృష్ణా నికర జలాలను ఆదా చేస్తారు. రెండో దశలో, అలా ఆదా చేసిన నీటిని రాయలసీమ కరువును నివారించడానికి వినియోగిస్తారు. ‘‘ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నదుల అనుసంధానం చేసి తీరుతాం. కరువుసీమ రాయలసీమను సస్యశ్యామలం చేసి రైతన్నకు అండగా నిలుస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు మొదలయినప్పటి నుంచీ చెబుతూనే వున్నారు. ‘‘పులివెందులకు నీళ్లొస్తే తమకు పుట్టగతులుండవని, తమ ఆటలు సాగవని వైసీపీ భయపడి ప్రాజెక్టుకు అడ్డం పడుతోంద’’ని వారు తరచూ ప్రతిపక్షం మీద విమర్శలు కూడా కురిపిస్తున్నారు.
 
పట్టిసీమ ప్రాజెక్టు జీవోలోగానీ, వర్క్‌ ఆర్డరులో గానీ ఎక్కడా రాయలసీమ ప్రస్తావన లేదు. 280 క్యూసెక్కుల (8 క్యూమెక్కుల) నీటి విడుదల స్తోమతగల 30 వర్టికల్‌ టర్బైన్‌ పైపుల ద్వారా ప్రతి ఏడాది 130 రోజుల వ్యవధిలో 80 టీయంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాడెల్టాకు పైప్‌ లైన్‌ ద్వారా మళ్ళిస్తారు అని మాత్రమే ప్రాజెక్టు సాంకేతిక వివరాల్లో వుంది.
 
కృష్ణా నీటిని రాయలసీమకు అందించడానికున్న ఏకైక ద్వారం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌. జూలై చివరి వారం నుంచి డిసెంబరు మొదటి వారం వరకు వుండే 130 రోజుల్లో 8,400 క్యూసెక్కుల వేగంతో రోజుకు 72 కోట్ల ఘనపు అడుగుల చొప్పున గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళిస్తాము అన్నంత స్పష్టంగా, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి ఫలానా తేదీ మొదలు ఫలానా తేదీ వరకు ఇన్ని వేల క్యూసెక్కుల వేగంతో కృష్ణా నీటిని రాయలసీమకు అందిస్తాము అని ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. ప్రభుత్వ నిర్వాహకులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఇప్పటి వరకు వెళ్ళకపోయినా ఇక ముందయినా ఆ 80 టీయంసీల నీళ్ళు రాయలసీమకు వెళతాయా? అంటే వెళ్లవు.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా - గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తే, కృష్ణానది ఎగువనున్న మహారాష్ట్రకు 18 శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27 శాతంగా 21 టీయంసీల నీళ్ళు అదనంగా ఇవ్వాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ సూచనల్లోనే ఒక నియమం వుంది. మనం చాలా వెనుకబడివున్నాం గానీ, ఈ అదనపు వాటా నీటిని నిల్వ చేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు అప్పుడే సంపూర్ణ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాయి. గోదావరి నీరు కృష్ణా బేసిన్‌కు విడుదల అయిన మరుక్షణం, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోనికి వచ్చే కృష్ణాజలాలు అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. అంటే, కృష్ణా బేసిన్‌లోకి మళ్ళించే 80 టీయంసీలలో ఎగువ రాష్ర్టాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో 30 టీయంసీలు ఎస్‌ఎల్‌బీసీకి 15 టీయంసీలు తెలుగు గంగకు కేటాయించాలని 1985లో, ఎన్‌.టి.రామారావు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులు లేవు.
 
ఈ 45 టీయంసీలు అయినా రాయలసీమకు దక్కుతాయా అంటే అదీ అనుమానమే. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చినపుడు మనది తెలంగాణతో కూడిన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌. ఇప్పుడు తెలంగాణ వేరే రాష్ట్రం కనుక వాళ్ళు 45 టీయంసీల్లో తమ వాటా తప్పక అడుగుతారు. ఆ తరువాత నికరంగా ఏ 27 టీయంసీలో మిగిలి వుంటాయి. అన్నీ సజావుగా సాగి రాయలసీమకు నీరు నిజంగానే నీరు వెళితే అది 27 టీయంసీలే.
అక్కడ కూడా ఒక తిరకాసు వుంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ వద్ద 854 అడుగులకు ఎగువన నీటి మట్టం వున్నప్పుడే కృష్ణా జలాలు రాయలసీమ లోనికి ప్రవేశిస్తాయి. ఈ సాంకేతిక అంశం కారణంగా భారీ వరదలు వచ్చినపుడు తప్ప శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లను విడుదల చేసే అవకాశం లేదు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్ళిస్తున్న సమయంలో శ్రీశైలం నీటి మట్టం కనీసపు నీటి విడుదల మట్టం (ఎండీడీఎల్‌) కన్నా ముప్పయి అడుగుల దిగువన వున్నది. అంటే ఈ ఏడాది, గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకు పారినా, కృష్ణా నీళ్ళు రాయలసీమకూ పారే అవకాశాలు తక్కువ.
 
గోదావరి నుంచి 80 టీయంసీల నీరు కృష్ణా డెల్టాకు మళ్ళించినా మళ్ళించకపోయినా, రాయలసీమలో కొత్తనీరు పారినా పారకున్నా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలు ముందుగా తమ తమ వాటాలు తీసేసుకుంటాయి. దీనివల్ల కృష్ణాడెల్టాకు కూడా ముప్పు వచ్చే ప్రమాదముంది. ఈ వివరాలు ప్రజలకు ప్రభుత్వం చెప్పదు, ముఖ్యమంత్రి చెప్పరు. నీటి పారుదల శాఖామంత్రి చెప్పరు. పైగా అబద్ధాలు చెబుతారు. అబద్ధాలు అపోహలు పెంచుతాయి. అపోహలు ప్రాంతాల మధ్య దూరాన్ని పెంచుతాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది.
 
రాయలసీమలో అక్కడక్కడ నిరసన సెగలు రగులుకుంటున్న వాసన వస్తోంది. దాన్ని చల్లార్చే ప్రయత్నం మొదలు కావాలి. చల్లార్చడం అంటే నమ్మకం కలిగించడం.
రౌడీయిజం, కార్పొరేట్‌ సంస్కృతి వచ్చాక పరిస్థితి కొంచెం మారింది గానీ, విజయవాడకు అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయం వుంది. రెండు సంఘటనలను అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం వుంది. రాయలసీమ అతివాదులుగా వున్న కడప కోటి రెడ్డి, పప్పూరి రామాచార్యులు గార్లని ఆహ్వానించి, నగర వీధుల్లో సకల మర్యాదలతో ఏనుగు అంబారీల మీద ఊరేగించి సత్కరించి సోదరభావాన్ని చాటిన మహత్తర దౌత్యచరిత్ర విజయవాడది.
 
‘‘ఇప్పటి వరకు దక్షిణాది వారి ఆధిపత్యమును చూస్తున్నాము. ఇకముందు ఉత్తరాదివారి ఆధిపత్యమును చూడవలయును కాబోలు’’ అని కడప కోటిరెడ్డి అనేవారు. ‘‘మదరాసు నుంచి విడిపోవడం మేలైనచో ఆంధ్రా నుంచి విడిపోవుట అంతకన్నా మేలు కదా?’’ అని పప్పూరి రామాచార్యులు అనేవారు. అలాగే ఆ రోజుల్లో తెలంగాణ అతివాదిగా పేరున్న కేవీ రంగారెడ్డి 70వ పుట్టిన రోజు వేడుకల్ని విజయవాడ ప్రజలు జరిపారు. రాయలసీమ నాయకుల్ని సన్మానించడంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కీలకపాత్ర పోషిస్తే, రంగారెడ్డిని సన్మానించడంలో అప్పటి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రధాన పాత్ర నిర్వహించారు. ఇద్దరూ విజయవాడ వాళ్ళే. వాళ్ళిద్దరి దౌత్యసాంప్రదాయాన్నీ, సోదరభావాన్నీ కొనసాగించడం నేటి చారిత్రక అవసరం.
డానీ
కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం