Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 10:33AM

‘మేడిగడ్డ’కే సై..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ప్రాణహిత నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడమే శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా లైడార్‌ సర్వే కూ డా ప్రారంభించింది. కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై 105 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించి సుమారు 20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 150 రోజుల్లో 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. మేడిగడ్డ నుంచి కాటారం, మల్హర్‌, ముత్తారం, మంథని, కమాన్‌పూర్‌ మండలాల మీదుగా రామగుండం మండలంలోని ఎ ల్లంపల్లి వద్ద శ్రీపాద సాగర్‌ ప్రాజెక్టులో ఈ నీటిని క లుపడం ద్వారా అక్కడి నుంచి యథావిధిగా గతంలో ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు నీటిని తరలించ తలపెట్టిన మార్గంలోనే కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని ప్రభుత్వం చెబుతున్నది. జంట నగరాలకు తాగు నీటి సరఫరాను కూడా చేయవచ్చని చెబుతున్నది. సర్వే పనులు తొందరగానే పూర్తవుతాయని ప్రభుత్వం చెబుతున్నా ఈ ప్రాజెక్టు కాలువలు వెళ్లే మార్గం విషయంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 
 అటవీ, సింగరేణి ప్రాంతాల మీదుగా కాలువలు
మేడిగడ్డ నుంచి మహదేవపూర్‌ మండలం సూరారం, అంబరట్‌పల్లి గ్రామాల మీదుగా ఉన్న అట వీ ప్రాంతం నుంచి కాటారం మండలంలోని గుంటూరుపల్లి, ప్రతాపగిరి, మల్హర్‌ మండలం రుద్రారం, బొగ్గుల వాగు, మల్లన్నగుట్ట, కాపురం మీదుగా ముత్తారం మండల గ్రామాలకు అక్కడి నుంచి మంథని, కమాన్‌పూర్‌ మండలాల గ్రామాల నుంచి ఎల్లంపల్లి వరకు కాలువలు తవ్వాల్సి ఉంటుందని అధికారులు సూత్రప్రాయంగా మార్గాన్ని ఖరారు చేశారు. మల్హర్‌ మండలంలో సింగరేణి సంస్థ తాడిచెర్ల బ్లాక్‌-2 గనిని తవ్వుకునేందుకు ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి పొందింది. ఈ బ్లాక్‌లో 68 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఈ బొగ్గు తవ్వాల్సిన అవసరం ఉండడంతో గని తవ్వకం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. నీటి పారుదల శాఖ ఇప్పటికి డిజైన్‌ చేసిన మార్గం ఈ గని మీదుగా వెళుతున్నందు వల్ల ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. మేడిగడ్డ నుం చి మల్హర్‌ మండలం దాటే వరకు సుమారు పది నుం చి పదిహేను కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉన్నందు వల్ల కేంద్ర అటవీ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుంది.
గోదావరి నదిపై 2008లో నిర్మాణ పనులు ప్రారంభించిన కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి కోసం ప్రత్యామ్నాయంగా 685 ఎకరాల భూమిని అటవీ శాఖకు చూపించడంతో పాటు అవసరమైన డబ్బులు కూడా చెల్లించింది. ఇది గడిచి ఏడు సంవత్సరాలైనా అనుమతులు రాలేదు. దీంతో ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో కాలువలు తవ్వేందుకు, పైపులైన్లు వేసేందుకు వీలు కలుగడం లేదు. ఇదే అటవీ ప్రాంతంలో మహదేవపూర్‌, మహాముత్తారం, కాటారం మండలాలను కలుపుతూ నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డుకు కూడా 15 కిలోమీటర్ల పొడవునా ఉన్న అటవీ ప్రాంతం నుంచి వెళ్లడానికి 1991లో రోడ్డు పనులు ప్రారంభమైనా, ఇప్పటికీ అటవీ శాఖ అనుమతులు లభించ లేదు. దీంతో మేడిగడ్డ ప్రాజెక్టుకు అటు.. సింగరేణి, ఇటు.. అటవీ శాఖ అనుమతులు ప్రధాన ఆటంకాలుగా ఉండే అవకాశమున్నది.
 
కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకంపై అనుమానాలు
మేడిగడ్డ వద్ద కొత్తగా బ్యారేజీ నిర్మిస్తున్నందు వల్ల ఇప్పటికే పనులు జరుగుతున్న కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం ఉంటుందా, రద్దవుతుందా అనే అనుమానాలు జిల్లాలో వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తిపోతల పథకం నిర్మిస్తుండడంతో ఈ అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు కొందరు దీనిని కొనసాగించే విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం యథావిధిగా నిర్మించి ఆయకట్టుకు నీరిస్తారని చెబుతున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటాకం, మల్హర్‌, మహదేవపూర్‌, మహా ముత్తారం మండలాల్లోని 45 వేల ఎకరాల భూములకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని 2008లో చేపట్టారు. రూ. 499.23 కోట్ల అం చనా విలువతో పనులు ప్రారంభించి ఇప్పటికీ దీనిపై 278 కోట్ల రూపాయలు వెచ్చించా రు. 2015 డిసెంబర్‌ మాసాంతానికి పనులు పూర్తి కావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
 
 నిలిచిన ‘ప్రాణహిత’ పనులు..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలతో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ చేయాలని ప్రభు త్వం తలపెట్టడంతో ప్రాణహిత ప్రాజెక్టు కాలువలు, సొరంగ మార్గాల పనులు గత ఏప్రిల్‌ నుంచి నిలిపి వేశారు. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి శ్రీపాద సాగర్‌ ప్రాజెక్టు వరకు 116 కిలోమీటర్ల మేరకు కాలువలు తవ్వడంతో పాటు 75వ కిలోమీటర్‌ వద్ద లిఫ్ట్‌ను నెలకొల్పవలసి ఉన్నది. ఈ పనిని 5 ప్యాకేజీలుగా విభజించి 6,229 కోట్ల 50 లక్షల అంచనాలతో పూర్తి చేసేందుకు ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 75 కిలోమీటర్ల వరకు కాలువల పనులు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 1390 కోట్ల 91 లక్షల రూపాయలను ఈ ప్యాకేజీలపై వెచ్చించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ఆదిలాబాద్‌ జిల్లాలోని 56 వేల ఎకరాలకు నీరివ్వాలనుకున్నారు. ఇప్పుడు ప్రాణహితను రీ డిజైన్‌ చేస్తున్న క్రమంలో వచ్చిన నిరసన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేయడం లేదని, దీనిని ఆదిలాబాద్‌ జిల్లాకే పరిమితం చేసి మేడిగడ్డ వద్ద నిర్మించే ప్రాజెక్టు ద్వారా ఇతర జిల్లాలకు సాగు నీటిని అందిస్తామని పేర్కొన్నది. అదనంగా ఆదిలాబాద్‌కు మరో లక్ష ఎకరాలకు కూడా నీరిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం చెబుతున్న విధంగా తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే 20 నుంచి 30 టీఎంసీల నీరు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం ప్రాణహిత-చేవెళ్ల కాలువలను తుమ్మడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు 1.8 నుంచి 2 టీఎంసీల నీరును ఎత్తిపోసేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా కాలువల నిర్మాణం పూర్తయ్యింది. మిగ తా కాలువలు కూడా ఇదే స్థాయిలో తవ్వాల్సి ఉం టుంది. ప్రాణహితను రీ డిజైన్‌ చేయడం వల్ల రోజుకు అర టీఎంసీ నీటిని తరలించేందుకు వీలుగా కాలువ లు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న రీ డిజైనింగ్‌ చర్యల వల్ల వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.