Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 03:18AM

అప్పులిస్తున్నారని స్కీములొద్దు: కేసీఆర్

 ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారమే సేకరించండి
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘వాళ్లు అప్పులు ఇస్తున్నారు కదా అని మనకు అవసరం లేకపోయినా వాళ్లు చెప్పిన స్కీములకు రుణాలు తీసుకునే పద్ధతి మనకొద్దు. మేం ఏ పథకాలకు రూపకల్పన చేస్తామో వాటికే మీరు నిధులు సేకరించండి. మన ప్రాధాన్యాల ప్రకారం రుణాలిచ్చే సంస్థలను వెతకండి’’ అని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ఎలాంటి స్కీములకు రుణాలు తీసుకోవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రుణాలు తీసుకున్న స్కీములు, తదితర అంశాలను విశ్లేషించిన కేసీఆర్‌.. భవిష్యత్తులో తీసుకోబోయే ఎలాంటి రుణమైనా ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారమే తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూపకల్పన చేసిన స్కీములకు ఏ ఆర్థిక సంస్థ రుణమిస్తోందో పరిశోధించి నిధులు తేవాల్సిన బాధ్యత ఆర్థిక శాఖదేనని ఆయన నిర్మొహ మాటంగా తేల్చి చెప్పినట్టు సమాచారం. దాంతో కేసీఆర్‌ రూపకల్పన చేసిన స్కీములకు నిధులను సమకూర్చే పనిలో తెలంగాణ ఆర్థిక శాఖ తలమునకలై ఉంది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. కాగా.. రీ డిజైన్‌ నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు అవసరమవుతుండటంతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు అడ్డు రాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని టీ ఆర్థిక శాఖ కేసీఆర్‌కు సూచించింది.