desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 02:23AM

20 శాతం పెరగనున్న లైసెన్సు ఫీజులు!

మద్యం పాలసీపై కసరత్తు
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అక్టోబరు నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్‌ పాలసీలో లైసెన్సు ఫీజుల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు పూర్తి కాగానే ఫైలును సీఎం కేసీఆర్‌ పంపి ఆమోదం పొందుతారు. బుధవారం నాటి కేబినెట్‌ భేటీలో చర్చ అనంతరం పాత పాలసీనే అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో పాత పాలసీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై అధికారులు గురువారం కసరత్తు చేశారు. ముఖ్యంగా లైసెన్సు ఫీజుల పెంపు అంశంపై చర్చించారు. సాధారణంగా ప్రతి ఎక్సైజ్‌ పాలసీలో ఫీజులను పెంచడం అనవాయితీ. ఈసారి కూడా దాదాపు 20 శాతం మేర లైసెన్సు ఫీజులను పెంచనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా లైసెన్సు ఫీజులను వసూలు చేస్తున్నారు. లెసెన్సు ఫీజుల్లో మార్పుల అనంతరం రెండు మూడు రోజుల్లో సీఎం కార్యాలయానికి ఫైలు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆమోదం లభించగానే ఎక్సైజ్‌ పాలసీ ప్రకటన, మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

 
గుడుంబా స్థావరాలపై దాడులు.. 16 మంది అరెస్ట్‌
చీప్‌ లిక్కర్‌పై వెనక్కి తగ్గినా గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎక్సైజ్‌ పోలీసులు గురువారం రంగంలోకి దిగారు. సైదాబాద్‌ పరిసరాలలో దాడులు నిర్వహించి 16 మంది గుడుంబా విక్రయదారులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 5882 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.