Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 01:59AM

లక్ష కోట్లైనా ఇస్తా..

  • భారీ, మధ్య, చిన్నతరహావి వంద శాతం పూర్తే టార్గెట్‌
  • 2017కల్లా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పూర్తి చేయాలి
  • ప్రణాళికలు రూపొందించండి.. ఖాళీలు భర్తీ చేసుకోండి
  • ఉత్తర, దక్షిణ తెలంగాణలకు వేర్వేరు హైడ్రాలజీ విభాగాలు
  • ప్రాణహిత, ఇంద్రావతినే గరిష్ఠంగా వాడుకోవాలి: సీఎం
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘మీకు లక్ష కోట్ల రూపాయలనైనా ఇస్తా. 2018కల్లా భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులన్నీ మొత్తం వంద శాతం పూర్తి కావాల్సిందే! పాతవి, కొత్తవి.. అన్ని ప్రాజెక్టులు అనుకున్న విధంగా పూర్తి కావడమే నాక్కావలసింది. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించండి. ఖాళీలు భర్తీ చేసుకోండి. ఈ ఆరు నెలల్లో నెలకు 1000 కోట్లు ఖర్చు చేయండి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 3500 కోట్లు ఖర్చు చేయండి. నాకు ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావాలి’’ అని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ధరల పెరుగుదల వల్లే కాంట్రాక్టర్లు పని చేయడం లేదని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారని, ఇప్పుడు ధరల సర్దుబాటుకు అనుమతి ఇచ్చామని, ఇక ఎలాంటి సాకులూ చెప్పవద్దని, పనులు పూర్తి చేయించే బాధ్యత మీదేనని అధికారులకు తేల్చి చెప్పారు. క్యాంపు ఆఫీసులో గురువారం ఆయన ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ‘‘ఎగువ గోదావరిపై మహారాష్ట్ర అనేక చెక్‌డ్యాంలు నిర్మించింది. భవిష్యత్తులో ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి. వాటిని తట్టుకోవాలంటే ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల నీళ్లను గరిష్ఠంగా వాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను వీలైనంత వేగంగా నిర్మించుకోవడంతోపాటు కాలువలు, నదులు, వాగులపై నిర్మించే వంతెనలకు అనుబంధంగా పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలు చెక్‌డ్యాంలు నిర్మించాలి. ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలి’’ అని కేసీఆర్‌ ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల బ్యారేజీకి ప్రత్యామ్నాయం గా ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టును 2017కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు నిధుల కొరత లేదని చెప్పారు. దీనితోపాటు నిర్మల్‌, ముథోల్‌ ప్రాజెక్టును, పెన్‌గంగ బ్యారేజీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, ధరల సర్దుబాటు వివాదం సమసిపోయినందున, ఆ ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందుకు అడ్డంకిగా మారిన భూ సేకరణ సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. ‘‘ఇప్పుడు తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది అవుతుంది. అందుకే ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యాలను గుర్తించింది. ఉమ్మడి రాష్ట్రం లో గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి రం గంలో తీరని అన్యాయం జరిగింది. దానిని సవరించడానికి సరైన ప్రణాళిక ఉండాలి. మన నీళ్లు-మన హక్కు. అవి మనకు వచ్చి తీరాలి’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సుమారు వంద మంది మాజీ సైనికోద్యోగులు, ప్రస్తుత, మాజీ పోలీసు అధికారులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణకు 1280 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలను కేటాయించారని, తెలంగాణలో కోటీ రెండు లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలమని, దీనిని సాగు చేయడానికి 1000 టీఎంసీలు చాలని, మిగిలిన 200 టీఎంసీలు ఇతర అవసరాలకు సరిపోతాయని చెప్పారు. కాగా, ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా తెలంగాణకు చెందిన ఒక్క ప్రాజెక్టును కూడా డిజైన్‌ చేయలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకూడదన్నది వారి ఆలోచన. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తీసుకుంటే తమ్మిడిహట్టి నుంచి చేవెళ్లకు నీరు ఎలా వస్తుందో అర్థం కాదు. వారు రూపొందించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం. అందుకే నీటిపారుదల ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని వివరించారు.