desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 01:32AM

మూసా వెనుక ముంబై శశికళ

  • పక్కా ప్రణాళికతో డ్రగ్స్‌ మాఫియా ఆపరేషన్‌
  • గతంలో రెండుసార్లు హైదరాబాద్‌కు మూసా
  • నార్కోటిక్స్‌ అధికారుల దర్యాప్తులో వెల్లడి
హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ను కడుపులో దాచుకుని దుబాయ్‌ నుంచి వచ్చి అధికారులకు చిక్కిన విదేశీ మహిళ మూసియా మూసా (32) వెనుక అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియా హస్తం ఉన్నట్లు నార్కోటిక్స్‌ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆగస్టు 28న.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ తనిఖీలో దొరికిపోయిన మూసియాను ఉస్మానియాకు తరలించిన అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించి, ఎనిమా ద్వారా రూ.కోటి విలువైన కొకైన్‌ ప్యాకెట్లను వెలికితీశారు. అదే సమయంలో.. ఆమె ఎవరు? ఆమె వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. మూసియా హైదరాబాద్‌ రావటం ఇది మొదటిసారి కాదని, గతంలో రెండుసార్లు ఇక్కడకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మూడోసారి రూ.కోటి విలువైన కొకైన్‌తో రావటం వెనుక.. ముంబైకు చెందిన లేడీ స్మగ్లర్‌ శశికళ అండదండలున్నట్లు, ఈ వ్యవహారంలో ఆమె ప్రధాన సూత్రధారి అని తేలింది. శశికళ ముంబైలో హెరాయిన్‌ స్మగ్లింగ్‌లో బడా డాన్‌. ఆమె ఏటా రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తుందనే రికార్డు ఉంది. మూసా తన కడుపులో డ్రగ్స్‌ను తీసుకు వచ్చాక.. వాటిని వెలికితీసేందుకు పక్కా కార్యాచరణతో ఇక్కడి స్మగ్లర్లు రెడీగా ఉన్నారని దర్యాప్తులో తేలింది.