Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 03:40AM

రాష్ట్రంలో కన్నీళ్ల పాలన: కాంగ్రెస్

మొగుళ్లపల్లి/ఖిలావరంగల్‌ (వరంగల్‌): రాష్ట్రంలో అప్పుల బాధతో రైతులు, కడుపుకోతతో అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగాలు లేక యువత, బిల్లు లు రాక ఇందిరమ్మ లబ్ధిదారులు కన్నీళ్లు పెడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కన్నీళ్ల పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదని, మహిళల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్‌ ప్రజలకు మాటల్లోనే అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడని, ఆకాశానికి నిచ్చెనలను వేస్తున్నాడని, మాటల్లోనే కోటలు కడుతున్నాడని వీటన్నింటిని వింటుంటే ప్రజలకు పిచ్చెక్కిపోతుందని అన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రికి చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌వి అన్నీ గారడీ మాటలు తప్ప చేతలు శూన్యమని పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్‌ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 14 నెలల కాలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపాధి అవకాశాలు, రైతులకు రుణమాఫీ, రెండు పడక గదుల ఇళ్ళు వంటి హామీలన్నీ నీటిమూటలయ్యాయని విమర్శించారు. రానున్న కాలంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పోరాడి వరంగల్‌ ఎంపీ, గ్రేటర్‌ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ విజయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు. ఎంపీ టికెట్‌ను అధిష్ఠానం ఎవరికిచ్చినా నాయకులు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు.