
న్యూఢిల్లీ, ఆగస్టు 7 : రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యుల ఆందోళనతో సభ స్తంభించిపోయింది. దీంతో పెద్దల సభలో ఎలాంటి చర్చలు జరగకుండానే సోమవారం నాటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ఛైర్మన్ హమీద్ అన్సారీ ఇటీవల మరణించిన మాజీ ఎంపీలు, ప్రముఖులకు నివాళి అర్పించారు. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభించ డానికి ఆయన ప్రయత్నించారు. వెంటనే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
కీలక పత్రాలు సభలో ప్రవేశపెట్టిన తర్వాత వారి వాదనలు వినిపించడానికి అనుమతి ఇస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దాంతో సభను మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో సభను మళ్లీ మధ్యాహ్నం 2-30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా అదే రగడ నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ కార్యక్రమాలు జరగడానికి సహకరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు తీరు మార్చుకోలేదు. దీంతో సభను సోమవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.