Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 19:50PM

చేనేతకూ వచ్చింది ఒక రోజు...

ఇకపై చేనేతకూ ప్రత్యేకంగా ఒక రోజు ఉంది! ప్రతి సంవత్సరం ఆగస్టు7వ తేదీని ‘జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోబో తున్నాం. జాతీయస్థాయిలో అది కార్యరూపం దాల్చేలా చేసిన వ్యక్తి యర్రమాద వెంకన్న నేత. చేనేతకు ఒక రోజు ఉండాలన్న ఆయన చేసిన కృషిని తెలుసుకుందాం...

 
‘మా ఊరు నల్గొండ జిల్లాలోని నాంపల్లి. మాది చేనేత కుటుంబం. ఇంటర్‌మీడియట్‌ వరకూ చదివాను. కులవృత్తి నాకు రాదు కానీ కొన్నాళ్లకు అనుకోకుండా నా దృష్టి చేనేత రంగం మీద పడింది. అప్పటి నుంచి గత పదిహేనేళ్లుగా ఈ రంగంలోనే పనిచేస్తున్నాను. 
 
విదేశీ వస్త్ర దహనంతో..
2003లో ‘చేనేత వర్గాల చైతన్య వేదిక’ను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాను. చేనేతకారుల స్థితిగతులపై ప్రశ్నించడమే కాదు చేతల్లో కూడా చేనేత పురోభివృద్ధికి ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన స్వచ్ఛంద సంస్థే ‘చేనేత ప్రోత్సాహక మండలి’. దీన్ని 2006లో ప్రారంభించాను. చేనేతకారుల కోసం పనిచేసేటప్పుడే ‘టైలర్స్‌ డే’ గురించి విన్నాను. అది నన్నెంతగానో ఆలోచింపజేసింది. గుడ్డలు కుట్టే దర్జీవాళ్లకి ఒక రోజు ప్రత్యేకంగా ఉండగా బట్టను నేసే వారికి ఒక రోజును ప్రత్యేకంగా ఎందుకు కేటాయించలేదనే ప్రశ్న నాలో ఉదయించింది. అప్పుడే చేనేతకు కూడా ప్రత్యేకంగా ఒక రోజు జాతీయస్థాయిలో ఉండేలా కృషిచేయాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే చేనేత రంగం అంటే భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు దర్పణం. చేనేత వస్త్ర వైభవానికి చిహ్నం. అందుకే ఏ రోజు చేనేత జాతీయ దినంగా పాటించడానికి బాగుంటుంది అన్న అంశంపై అధ్యయనం ప్రారంభించాను. 1905 ఆగస్టు7న జాతీయోద్యమంలో భాగంగా కలకత్తా వేదికగా విదేశీ వస్త్రదహనం జరిగింది. ఆ రోజును స్ఫూర్తిగా తీసుకుని ఆగస్టు 7ను చేనేత జాతీయ దినోత్సవంగా పాటిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అహింసామార్గంలో మనం చేసిన స్వాతంత్రపోరాటానికి, స్వేచ్ఛకు అదొక గొప్ప స్ఫూర్తిగా అనిపించింది.
 
జాతీయ స్పందన..
ఇక ఆలస్యం చేయలేదు. నా ప్రయత్నాలు ప్రారంభించాను. 2008లో దేశంలో తొలిసారిగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో చేనేత దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టాం. అలా ప్రారంభమైన మా ప్రయత్నాలు ఢిల్లీలోని ఎర్రకోట వరకూ చేరాయి. అక్కడ హ్యాండ్‌లూమ్‌ వాక్‌ నిర్వహించి జాతీయ దృష్టిని ఆకర్షించాం. ఢిలీల్లోని ఎర్రకోట నుండి మహాత్మాగాంధి రాజ్‌ఘాట్‌ వరకూ ‘హ్యాండ్‌లూమ్‌ వాక్‌’ నిర్వహించాం.
 
నేడు ప్రధాని చేత ప్రారంభం..
ఆధికారికంగా ప్రభుత్వం తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోది చేతుల మీదుగా నేడు చెన్నైలో ప్రారంభించనున్నారు. తమిళనాడులో ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. ‘జాతీయ చేనేత దినోత్సవ’ లక్ష్యం చేనేత కులాల గౌరవం, వారి అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేయడమే. ఎన్నో ఏళ్లుగా జాతీయ చేనేత దినం కోసం మేం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. చేనేతపై ప్రజలను చైతన్యపరచాలనుకున్నాం. అందుకే చేనేత దినోత్సవ ఆవశ్యకతను తెలుపుతూ బ్రోచర్లు, చార్ట్‌లు, ఎస్‌ఎంఎ్‌సలు, ఈ మెయిల్స్‌, వాయిస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌, పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించడానికి ప్రయత్నించి సఫలీకృతుడనయ్యాను. అంతేకాదు చేనేత చరిత్ర, వైభవం గురించి ‘స్వదేశీయం’ అనే సంగీత, నృత్యరూపకాన్ని ప్రదర్శించాం. ఆగస్టు7ని జాతీయ చేనేత దినంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం. దీనికి ఎంతో స్పందన వచ్చింది. చేనేత దినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో దేశ, రాష్ట్ర స్థాయి నాయకులకు, ప్రముఖులకు ఉత్తరాలు రాశాం. చేనేత వస్త్రాలను ఎందుకు వాడాలో తెలియజేసే 18 పాయింట్లను క్లాత్‌ మీద రాసి బ్యానర్ల సైజులో పలు చోట్ల పెట్టాం. చేనేతకు ప్రత్యేకంగా ఒక నేషనల్‌ డేని ప్రకటించవలసిందిగా కోరుతూ ప్రధాని మోదికి ఒక లేఖ రాశాను. అందులో చేనేత గొప్పతనం, దాని చరిత్ర, తదితర అంశాల గురించి వివరించాను. జాతీయ చేనేత దినాన్ని ఆధికారికంగా ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ జూన్‌ 19న ప్రధాని నుంచి లేఖ వచ్చింది. అంతేకాదు 2015, జూలై 29న ఇది గెజిట్‌ అయింది కూడా. ఈ అంశం గురించి కేబినెట్‌లో చర్చిండమే కాదు, ఒక కమిటీని సైతం వేసి అందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, కేరళ వంటి చోట్ల కూడా ఎందరో ఇందుకోసం కృషిచేశారు. 
 
చేతల్లోనూ చేనేత కోసం...
చిన్నతనం నుంచీ నాకు సామాజిక ఉద్యమాలపట్ల, అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ. అదే నన్ను చేనేత అభివృద్ధి కోసం పూనుకునేట్టు చేసింది. చేనేతపై మ్యాగజైన్‌ని నడిపాను. ‘చేనేత వార్తలు’ అని ఒక నిమిషం బులిటెన్‌ని టెలికామ్‌కు సంబంధించిన ఒక సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అందజేస్తుంటాను. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. ప్రారంభంలో మేం హెల్ప్‌లైన్‌ను కూడా నిర్వహించాం. తర్వాత ఆర్థిక కారణాలతో ఆపేశాం. కానీ మళ్లీ తొందరలోనే దాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను. నేను ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం కూడా చేస్తున్నాను. ఇంతక్రితం వరకూ నేను పాలసీ, అడ్వకసీ, మూవ్‌మెంట్స్‌, చేనేతను ప్రమోట్‌ చేసే కార్యక్రమాల్లో ఉండేవాడిని. ఇప్పుడు వాటితోపాటు ప్రొడక్షన్‌ పని కూడా మొదలెట్టాను. మెదక్‌జిల్లా దుబ్బాక, నల్గొండలోని కోయిలగూడెంలలో చేనేతకారుల చేత లినన్‌ మీద కలంకారీ నేయిస్తాను. లినన్‌ నూటికి నూరు శాతం ఫైబర్‌ మెటీరియల్‌. ఇది ఎక్కువగా యూర్‌పలో పండుతుంది. ముందు ముందు ఆలేరు, గుండాల ప్రాంతాల్లోని నేతకారుల కోసం కూడా పని చేపట్టాలనుకుంటున్నాను. చేనేతకారుల నైపుణ్యాన్ని పెంపొందించాలి. వారి ఆదాయపు వనరులను పెంచాలి. నేతకారుల నైపుణ్యాన్ని పెంచడంతోపాటు అందులో చోటుచేసుకుంటున్న నూతన మార్పులను ఎప్పటికప్పుడు వారికి తెలియజేయడం, వారి ఉత్పత్తులకు మార్కెట్‌ని పెంచడం, మార్కెట్‌తో నేతకారులను అనుసంధానం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇవి వారి జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని వాళ్లు కొనసాగించగలిగేట్టు చేస్తాయని నా గాఢాభిప్రాయం....’ అని చెప్పుకొచ్చారు ‘చేనేత ప్రోత్సాహక మండలి’ ఛైర్మన్‌ వెంకన్న నేత.