Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 03:02AM

నియోజకవర్గానికి పది గురుకుల బడులు

  • రాష్ట్రవ్యాప్తంగా 1190 ఆశ్రమ పాఠశాలలు
  • కొత్తగా 522 స్కూళ్లు ప్రారంభించాలి
  • ఇంటర్మీడియట్‌ దాకా ఉచిత విద్య
  • ఆ తర్వాతా కోర్సులు, వసతిపై విధానం
  • మైనారిటీలకు జిల్లాకొక హాస్టల్‌
  • నియోజకవర్గానికో దళిత బాలికా హాస్టల్‌
  • ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సులను మార్చాలి
  • అవసరమైతే లెక్చరర్‌ పోస్టుల భర్తీ: సీఎం
  • ‘కేజీ టు పీజీ’పై ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెసిడెన్షియల్‌ పాఠశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నియోజక వర్గానికి సగటున 10 చొప్పున... రాష్ట్రవ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచితంగా బోధించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. 12వ తరగతి తర్వాత కూడా విద్యారులు ఎంచుకోవాల్సిన కోర్సులు, వసతి సౌకర్యాలు వంటి అంశాలపై సమగ్రమైన విధానం రూపొందించాలని కేసీఆర్‌ సూచించారు. ‘కేజీ టు పీజీ’ విద్యా విధానం, విధి విధానాలపై సచివాలయంలో బుధవారం విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో కేసీఆర్‌ రెండు విడతలుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు ఇలా... కేటగిరీల వారీగా వేర్వేరు రెసిడెన్షియల్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కో విధానం, మెనూ, మెస్‌ చార్జీలు, ఒక్కో బడ్జెట్‌ ఉన్నాయి. అలా కాకుండా అందరికీ ఒకే రకమైన విద్య, వసతి, సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం ఉన్నంతలో సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మెరుగ్గా నడుస్తున్నాయి. అవసరమైతే స్వల్ప మార్పులు చేసుకుని అదే నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉండాలి’’ అని కేసీఆర్‌ ఆదేశించారు. విద్యార్థులకు గ్రాముల చొప్పున కాకుండా, ఎవరు ఎంత తింటే అంత.. బఫే పద్ధతిలో ఆహారం అందించాలని ఆదేశించారు. పేద విద్యార్థులందరికీ కుల మతాలతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలన్నారు.
తెలంగాణలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉనప్పటికీ... వారి కోసం ఉన్న హాస్టళ్లు చాలా తక్కువగా ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా హాస్టళ్లు ఉండగా... మైనారిటీల కోసం కేవలం 21 మాత్రమే ఉన్నాయి. అందువల్ల, మైనారిటీల కోసం ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్‌ పాఠశాల, ఒక హాస్టల్‌ ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించాం’’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు. మధ్యలోనే చదువు మానేసే వారి సంఖ్య (డ్రాప్‌ఔట్స్‌) మైనారిటీ బాలికల్లో ఎక్కువగా ఉందని... ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే వారు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. ప్రతి నియోజక వర్గంలో దళిత అమ్మాయిల కోసం ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతిక విద్యా విధానంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చదువంటే కేవలం ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే అనే భావన పోవాలన్నారు. ‘‘చాలామంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు సరైన ఉద్యోగాలు లేక హోంగార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేయటం సిగ్గు చేటు. ఈ పరిస్థితి నివారించడానికి సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాలి. సమాజానికి అవసరమయ్యే సేవలు ఏంటి? అనే విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలి. ఐటీఐలాంటి సంస్థలను కూడా విద్యా శాఖే నిర్వహించాలి’’ అని కేసీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో గుర్తించి వాటికి అనుగుణమై కోర్సులు డిగ్రీలో ప్రవేశపెట్టాలన్నారు. పోటీ పరీక్షలంటే కేవలం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలే అనే భావన పట్టాభద్రుల్లో నెలకొని ఉందని... దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులు సమర్థంగా నిర్వహించాలని, అవసరమైతే లెక్చరర్ల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

మాతృభాషపై మమత

తెలంగాణ పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూ భాషలను సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకునే వె సులుబాటు ఉండాలని, ఇంగ్లీషు మీడియంలో చదివినప్పటికీ తమ మాతృ భాష అయిన తెలుగు లేదా ఉర్దూపై పట్టు కోల్పోకుండా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికి తల్లీతండ్రీ రాష్ట్ర ప్రభుత్వమే అని ఇప్పటికే ప్రకటించుకున్నందున... వారి పోషణ, చదువు, స్వయం సమృద్ధి విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. అనాథలందరినీ ‘స్టేట్‌ చిల్డ్రన్‌’గా గుర్తించాలని చెప్పారు.