Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 04:10AM

కొప్పులకు మంత్రి పదవిపై సీఎం కేసీఆర్‌ ప్రకటనతో చర్చ..

మంత్రుల సన్నిహితుల్లో గుబులు 
హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేబినెట్‌ పునర్వ్యస్థీకరణపై మరోసారి నేరుగా కాకపోయినప్పటికీ, పరోక్షంగా సంకేతాలిచ్చారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌కు త్వరలో మంత్రి పదవి ఇస్తానని ప్రకటించటం ద్వారా మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పారు. ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్న వారు త్యాగాలకు సిద్ధం కావాలంటూ సీఎం ఇటీవల టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్‌ కేబినెట్‌లో చేర్పులు, మార్పులపై సంకేతాలు ఇవ్వటం ఇదే మొదటిసారి కాదు. నెల క్రితం సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ఆయన సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక శాఖ మంత్రిని చేస్తానని ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్‌లేవీ ఖాళీగా లేవు. నిబంధనల ప్రకారం సీఎంసహా 18 మందితో మంత్రివర్గం కొలువుదీరి ఉంది. దీంతో అప్పట్లోనే రసమయిని కేబినెట్‌లోకి తీసుకుంటే, ఎవరి మంత్రి పదవి ఊడుతుందనే చర్చ ప్రారంభమయ్యింది. ఇప్పుడు మంత్రివర్గంలోకి కొప్పుల ప్రవేశిస్తే....వైదొలగేది ఎవరనే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలుస్తోంది. సీఎం ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తానని ఈమధ్య ప్రకటించారో...వారిద్దరూ కరీంనగర్‌జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే. ఇద్దరూ దళితులే. రసమయి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి కాగా, ఈశ్వర్‌ మాల సామాజిక వర్గానికి చెందిన నేత. వీరిద్దరినీ కేబినెట్లోకి తీసుకోవాలంటే, ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారిలో ఇద్దరిని తప్పించాలి. మరోవైపు కరీంనగర్‌ నుంచి కేబినెట్‌లో ఈటెల రాజేందర్‌, కె.తారకరామారావు ఉన్నారు. కొప్పుల, రసమయిను కూడా కేబినెట్‌లోకి తీసుకుంటే, కరీంనగర్‌ జిల్లా నుంచి నలుగురు మంత్రి పదవులు పొందినట్లవుతుంది. అంతేకాక ప్రస్తుతం కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒక్కరే దళితుడు. ఆయనను మాదిగ సామాజిక వర్గం కోటాలో తీసుకున్నారు. అయితే బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియంను మాదిగ సామాజిక వర్గానికి చెందినట్లుగా భావించలేమని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే మాదిగ సామాజిక వర్గానికే చెందిన పిడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, రసమయి బాలకిషన్‌ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కేబినెట్‌ హోదాలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌..మంత్రి పదవులు ఇస్తానంటూ చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు ఆచరణ సాధ్యమనే సందేహాలు అధికార టీఆర్‌ఎస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వర్‌లో..ప్రభుత్వ పథకాలపై ప్రచారం మంచిగా చేయాలనీ.... రసమయి బాలకిషన్‌లో స్ఫూర్తిని నింపేందుకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పారా? లేక వారిని నిజంగానే కేబినెట్‌లోకి తీసుకుంటారా? అనే విషయాలపై పాలకపార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగితే వచ్చే శ్రావణ మాసంలోనా చేస్తారా? లేక బల్దియా ఎన్నికల తర్వాతనా? అనే అంశాలపై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్‌ పునర్వ్యస్థీకరణపై సీఎం ఇస్తున్న సంకేతాలు మంత్రుల సన్నిహితుల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 2014, జూన్‌ 2న సీఎంగా కేసీఆర్‌, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది డిసెంబర్‌ 16న కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఏడాది జనవరి 25న కేబినెట్‌లోని డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్యను బర్తరఫ్‌ చేసి, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్క ఖాళీ లేకపోవటంతో సీఎం కేసీఆర్‌ కొత్తగా ఎవరినైనా కేబినెట్‌లోకి తీసుకుంటే, ఎవరు పదవులు కోల్పోవాల్సి వస్తుంది? ఎవరి జోలికి సీఎం వెళ్లరు? ఒకవేళ ఎవరినైనా మంత్రి పదవి నుంచి తప్పిస్తే సమీకరణాలు ఏంటి? తప్పించకపోతే అందుకు కారణాలు ఏంటి? అనే చర్చ జరుగుతోంది. ‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవకముందే, సీఎం కేసీఆర్‌ ఒకరిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు. ఆ స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారానికి ఆయనే ఆస్కారం ఇస్తున్నారు. ఇది మంత్రి పదవుల్లో ఉన్న వారిని అభద్రతా భావంలోకి నెట్టటమే’’ అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు ఈ పరిణామాలపై వ్యాఖ్యానించారు.