Jul 7 2015 @ 02:50AM

‘ఆంధ్రోళ్లు’ అనొద్దు.. కావాలంటే నేతలను తిట్టుకోండి
ఇద్దరు సీఎంలూ ఇలాగే ఉంటే అంతర్యుద్ధమే

  • ఇద్దరు సీఎంలు బాధ్యతగా మెలగాలి
  • పరిష్కారంపై సహకరించుకోవాలి
  • బాబు, కేసీఆర్‌లకు పవన్‌ హితవు
హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నెల రోజులుగా అన్నీ మరిచి పోయి ఓటుకు నోటు కేసుపైనే దృష్టి సారించారన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్‌-8కు తాను వ్యతిరేకమని తెలిపారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులపై త్వరలోనే స్పందిస్తా’ అని కొన్నాళ్ల క్రితం ట్విట్టర్‌లో పేర్కొన్న పవన్‌... సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘జనసేన పెట్టిన తర్వాత... చాలా తక్కువసార్లు మీడియాతో మాట్లాడాను. ఆయా అంశాలపై నాకు అభిప్రాయాలు లేక కాదు. రాష్ట్రాలు విడిపోయాక బాధ్యతగా మాట్లాడాలి. అవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పాలి!’’ అంటూ అనేక అంశాలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
 
‘సెక్షన్‌-8’తో మరో అన్యాయం
‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసింది. ఇప్పుడు... సెక్షన్‌ 8ను అమలు చేసి తెలంగాణకు కూడా అన్యాయం చేయవద్దు. మరో తప్పు చేయవద్దు. అంతర్యుద్ధంలాంటిది వస్తేనే... సెక్షన్‌ 8 వర్తిస్తుంది. అంతేతప్ప, చంద్రబాబుపై ఏదైనా కేసులో అభియోగాలు మోపితే కాదు. అయితే, ఈ నిబంధన అమలులోకి రాకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పే బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకోవాలి. కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్‌లో సమస్యలున్నాయని చంద్రబాబు అంటున్నారు. ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక పార్లమెంటరీ కమిటీ వేయాలి. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన కొందరు నేతలతో కమిటీ వేసి ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షించాలి. హైదరాబాద్‌లో ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించి సున్నితమైన అంశాలపై పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలి. ఈ అధికారి నేరుగా పీఎంతో మాట్లాడేలా ఉండాలి. సీమాంధ్రుల భద్రతకు సమస్యలున్నాయి. అవి పెద్దవిగా కాకుండా ఈ అధికారి పరిశీలించాలి.
 
ఉద్యమ భాష వద్దు
ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంగానే విడిపోయింది. మరో దేశంగా కాదు. కేసీఆర్‌ ప్రభుత్వం నిండు నూరేళ్లూ జీవించాల్సిన 640 మంది బలిదానాలపై నడుస్తోంది. తెలుగు ముఖ్యమంత్రులు.. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకా ఉద్యమ భాష వాడటం సరికాదు. కేసీఆర్‌ ‘ఆంధ్రోళ్లు’ అనే పదం ప్రయోగించడం తగదు. మంత్రి హరీశ్‌రావు ఎక్కువగా ఈ పదం మాట్లాడుతుంటారు. ఆంధ్రోళ్ల పంచాయితీ తీరలేదు.... టీడీపీ ఆంధ్రా పార్టీ అని అంటుంటారు. దొరలు అంటే దోచుకునే వారని, ఒక కులానికి ఆపాదించడం సరికాదని హరీశ్‌రావు ఈ మధ్య చెప్పారు. అలాగే... ఆంధ్రోళ్లు అంటే ఒక్క కులం కాదు. ‘ఆంధ్రోళ్లు’ మొత్తం టీడీపీలోనే లేరు. ఇతర పార్టీల్లోనూ ఉన్నారు. తిట్టాలనుకుంటే నేరుగా ఆ నేతల పేర్లతో నేరుగా తిట్టండి. దయచేసి ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే పదాలు వాడొద్దు. ఈ పరిస్థితిని కేసీఆర్‌ నివారించాలి. లేదంటే... పోలీసులు కొట్టుకున్నట్లే, ప్రజలూ కొట్టుకునే ప్రమాదముంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగితే.. అశాంతి చెలరేగి అంతర్యుద్ధానికి దారి తీస్తుందని.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీతో చెప్పాను. ఇదే జరిగితే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రుల విధానాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం మొదలవుతోంది. అయితే... ఇరు ప్రాంతాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొల్పేలా యాదాద్రి పుణ్య క్షేత్ర అభివృద్ధికి చీఫ్‌ అర్కిటెక్ట్‌గా విజయనగరం వాసి ఆనందసాయిని కేసీఆర్‌ నియమించారు. తెలుగు జాతి ఐక్యత దిశగా మొదటి అడుగు వేసిన కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాను.
 
హైదరాబాద్‌పై హక్కు కోరవద్దు
హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టకూడదు. అలాగే, సీమాంధ్ర పాలకులు కూడా ఒక విషయం గుర్తించుకోవాలి. హైదరాబాద్‌పై హక్కు ఉందని చెప్పడంవల్ల అశాంతి చెలరేగడం తప్ప, మరో ప్రయోజనం ఉండదు. వారు కొత్త రాజధాని నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. నవ్యాంధ్ర రాజధానిని హైదరాబాద్‌తో పోల్చుకోడం కూడా తగదు.
 
కేంద్రం స్పందించాల్సిందే...
విభేదాలు ఇలాగే ఉంటే అంతర్యుద్ధం పరిస్థితులు వస్తాయని నేను గతంలో చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ... మొన్న నాగార్జున సాగర్‌ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇది చూశాక పౌర అశాంతికి మనం ఎంతో దూరంలో లేదనే భయం నాకు కలిగింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే శత్రుదేశాల సైనికుల్లా కొట్టుకుంటే... సామాన్యుల సమస్యలను పరిష్కరించేదెవరు? రాష్ట్ర విభజన అనేది అత్యంత సున్నితమైన అంశం. ఇవన్నీ నేను మోదీకి చెప్పాను. 60 ఏళ్లుగా హైదరాబాద్‌తో సీమాంధ్రులకు అనుబంధం ఉంది. దానిని తెంచేయడం అంత సులువు కాదు. కానీ... పద్ధతీపాడు లేకుండా విభజించారు. అక్కడేమో రాజధానికి డబ్బులేవు. ఇక్కడేమో మిగులు రాష్ట్రం. యూపీఏ, ఎన్డీయే కలిసి విభజన నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడం నిజం. రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణను సంతోషపెట్టినట్లే... విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఏపీని కూడా ఆదుకుని సంతోషపెట్టాలి. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై కేంద్రం దృష్టి సారించాలి. రాజధాని నగర నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలి.
 
రాజకీయ క్రీడ
నేటి రాజకీయాల్లో నీతి నిజాయితీలను గురించి మాట్లాడడం అంటే.. తన కంట్లో దూలం ఉంచుకుని ఎదుటోడి కంట్లో నలుసును చూడడంలాంటిదే. ఓటుకు నోటు కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. అది తప్పా, ఒప్పా అనేది కోర్టు చెబుతుంది. రేవంత్‌ విషయానికి వస్తే... ముందూ వెనుకా కూడా చూడాలి. టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంపైనా కేసీఆర్‌ ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, ఆయన సనత్‌నగర్‌ ప్రజల మన్నన పొందగలరా? రేవంత్‌ రెడ్డి వ్యవహారం ఒక రాజకీయ క్రీడ. అలాగే, రాజకీయ క్రీడ కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం వికృత క్రీడ! ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమో.. కాదో నాకు తెలియదు. దీనిపైన సీబీఐ విచారణతే నిజమేమిటో తెలుస్తుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడం మాని... ఒకరిపై ఒకరు ట్యాపింగ్‌లు చేసుకుంటూ పోతే ప్రజల మధ్య అశాంతికి దారి తీస్తుంది.

మీడియాకు సంకెళ్లు సరికాదు
ప్రభుత్వాలు మీడియా స్వేచ్ఛను హరించరాదు. మీడియాను నియంత్రించినంత మాత్రాన తమ వ్యవహారాలు బయటికి రావని అనుకోవద్దు. ఇరు రాష్ట్రాల్లోనూ మీడియాపై నిషేధాన్ని తొలగించాలి. 

ఏపీ ఎంపీలకు వ్యాపారాలే ముఖ్యం..
విభజన తర్వాత సీమాంధ్రలో ఒక సుస్థిరమైన వాతావరణం కావాలనే ఎన్నికల సమయంలో నేను బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికాను. అయితే... విభజనకు ముందు తెలంగాణ కోసం ఆ ప్రాంత ఎంపీలు పోరాడినట్లుగా... విభజన తర్వాత ఏపీ ప్రయోజనాల కోసం నవ్యాంధ్ర ఎంపీలు పోరాడటంలేదు. కారణమేమిటంటే... వీరు వ్యాపారులు. వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం. దీంతో... వీరు కేంద్రం వద్ద నీళ్లు నములుతున్నారు. సీమాంధ్ర ఎంపీలకు ఆత్మగౌరవం అంటే తెలుసా? అనే సందేహం కలుగుతోంది. ‘తిడితే కేసీఆర్‌లా తిట్టాలి. పడితే పౌరుషంలేని సీమాంధ్ర ఎంపీల్లా పడాలి’ అనే నినాదాన్ని నేను ఈ మధ్య చూశాను. ఎంపీ టికెట్‌ కోసం ఆవేశంతో ఊగిపోయిన కేశినేని నాని... ఎంపీగా గెలిచాక ఏం చేస్తున్నారు? పార్లమెంటు గోడలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారా? మీరు ఇలా భయపడుతూ, వ్యాపారాలే ముఖ్యమనుకుంటే... వందలమంది ప్రాణాలకు, దశాబ్దాల కాలానికి నష్టం చేసిన వారవుతారు. సీమాంధ్రకు కేసీఆర్‌కంటే మీరే ఎక్కువ అన్యాయం చేసిన వారవుతారు.