Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 08:34AM

విశాఖ: మద్యం దుకాణాలపై మహిళల సమరం

  •  ప్రభుత్వ వైన్‌షాపులు పెట్టొద్దని మహిళల ఆందోళన
  • చిలకపేటలో ఎక్సయిజ్‌ అధికారులతో వాగ్వాదం
వన్‌టౌన్‌: వన్‌టౌన్‌ చిలకపేటలో ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయగా స్థానికులు శనివారం అడ్డుకున్నారు. చిలకపేట లక్ష్మీటాకీస్‌ జంక్షన్‌ వద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రొహిబిషన్‌, ఎక్సయిజ్‌ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మద్యం దుకాణాన్ని ప్రారంభించడానికి సర్కిల్‌ -1 సీఐ కుమారి సిబ్బందితో శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో షాపును తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. చిలకపేటలో మద్యం దుకాణాన్ని ప్రారంభించవద్దని ఆందోళనకు దిగారు. చిలకపేటకు వెళ్ళడానికి ఒకే మార్గం వుందని, ఇక్కడ దుకాణం ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. చిలకపేటలో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలోని మహిళలు కొందరు కార్మికులుగా, మరికొందరు బంగారం దుకాణాల్లో పని చేస్తున్నారని, వీరంతా రాత్రి సమయాల్లో ఇళ్లకు చేరతారన్నారు. ఇక్కడ మద్యం దుకాణం పెడితే మహిళలకు రక్షణ ఎలా వుంటుందని నిలదీశారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అధికారులు స్థానిక మహిళలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మద్యం దుకాణంలో కేవలం అధికారులే వుండి విక్రయిస్తారని, దుకాణంలో, పరిసరాల్లో మద్యం సేవించడం జరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భర్తలు ఇంటికి సీసాలతో మద్యం తీసుకొచ్చి తాగి తమను కొడితే బాధ్యత మీరు వహిస్తారా? అని ప్రశ్నించారు. చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. అలాగే రామకృష్ణ జంక్షన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించబోమని హెచ్చరించారు.