Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 02:58AM

ఆ ‘టన్నులు’.. డబ్బులే!
జగన్‌ అక్రమాస్తుల కేసులో కోడ్‌ ఛేదన

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో ఆధారాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దాల్మియా సిమెంట్స్‌ నుంచి జగన్‌కు హవాలా రూపంలో సొమ్ము అందిన అంశానికి సంబంధించిన ఆధారాలను సేకరించిన సీబీఐ వర్గాలు.. వాటిని కోర్టుకు నివేదించాయి. దీంతో జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈ ఆధారాలను చేర్చి విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. 2010 మే నుంచి 2011 జూన్‌ మధ్యకాలంలో దాల్మియా నుంచి జగన్‌కు రూ.కోట్ల ముడుపులందాయని సీబీఐ గతంలో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ క్రమంలో దాల్మియా సిమెంట్స్‌కు చెందిన జోయ్‌దీప్‌ బసు అనే వ్యక్తి నుంచి ఓ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకొని విశ్లేషించగా.. ‘3500 టన్నుల స్టాక్‌ అందింది.. ఇంకో 500 టన్నులు పంపండి’ అని పేర్కొంటూ ఆడిటర్‌ విజయసాయిరెడ్డి పంపిన ఈ మెయిల్‌ కనిపించింది. అయితే ఆ సమయంలో సిమెంటు లావాదేవీలు జరగలేదని.. హవాలా నగదుకు సాయిరెడ్డి పెట్టిన కోడ్‌.. ‘టన్నుల’ని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే, సీబీఐ ఆరోపణలను జగన్‌ న్యాయవాదులు తోసిపుచ్చారు. దీంతో ఈ కేసును మరింత క్షుణ్నంగా విచారించిన సీబీఐ.. ఆ సమయంలో సిమెంటు కానీ, రా మెటీరియల్‌ కానీ దాల్మియా నుంచి విజయసాయిరెడ్డికి వెళ్లలేదని.. కేంద్ర కమర్షియల్‌ టాక్స్‌ వర్గాల నుంచి ఆధారాలు తీసుకొచ్చి కోర్టుకు సమర్పించింది. వీటిని నమ్మదగిన ఆధారాలుగా పరిగణించిన కోర్టు విచారణకు స్వీకరించింది.