Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 21:33PM

ఇలాంటి స్నేహాలు వద్దే వద్దు

డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు... ఆత్మస్థైర్యం తగ్గినట్టు అనిపిస్తోందా. అందుకు కారణం మీ స్నేహితులేనేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అందరూ నిజమైన స్నేహితులే ఉండరు. స్నేహం ముసుగులో మీలో న్యూనతా భావాన్ని పెంపొందించేది ఇటువంటివాళ్లే కాబట్టి. వీళ్లను గుర్తించడం కాస్త కష్టమే. అయినప్పటికీ ఎలా గుర్తించాలో మేము మీకు చెప్తాం అంటున్నారు డాక్టర్‌ జె ఎమ్‌ వాద్వాన్‌, డాక్టర్‌ గౌరవ్‌ గుప్తాలు. సైకియాట్రిస్టులు అయిన ఈ ఇద్దరు నిపుణులు అందిస్తున్న ఆ సూచనలు చదివి ఫాలో అయిపోండి.

గోతులు తవ్వే రకాలు ఎలా ఉంటారంటే మీరో ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేస్తారు. ఆ ప్లాన్‌ అమలుకాకుండా చేయడానికి వాళ్ల తెలివితేటలన్నీ వాడతారు. అలాచేసేముందు మీరెంత శ్రమ పడ్డారనేది ఆలోచించరు. ఆ చేతల వల్ల మీ మనసెంత బాధపడుతుందనే విషయంతో వాళ్లకు సంబంధమే ఉండదు. ఇలాంటి వాళ్ల పట్ల మీరెలా ఉండాలంటే... వాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారన్న విషయాన్ని ముందుగానే గమనించినట్టు ప్రవర్తించాలి. ఇలా చేస్తే ముందు ముందు వాళ్లు మీ విషయంలో జోక్యం చేసుకునే ధైర్యం చేయరు.
 
మొండిగా - మూర్ఖంగా...
మొండిగా, సున్నితత్వ పాళ్లు ఏ మాత్రం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వాళ్ల మనోభావాల గురించి పట్టించుకోరు. వాళ్లతో మీరూ అలానే ప్రవర్తిస్తే దొంగ ఏడుపులు ఏడ్చి మిమ్మల్ని దోషుల్ని చేస్తారు. ఇటువంటి వాళ్లని దగ్గర కూర్చోబెట్టుకుని వైఖరి మార్చుకోవాలని చెప్పాలి. అలా చెప్పాక కూడా తీరు మారకపోతే మీరే వాళ్లని వదిలేసి వెళ్లండి.
 
కలహశీలురు
మీకు రేపు ఫైనల్‌ పరీక్ష ఉంటుంది. దానికోసం చదువుకుంటుంటారు. కాని మీ రూమ్‌మేట్‌ మాత్రం పెద్దగా పాప్‌ మ్యూజిక్‌ పెట్టుకుని వింటుంటారు. ‘‘ఇలా ఎందుకు చేస్తున్నావ’ని మీరడిగితే... ‘మ్యూజిక్‌ లేకుండా నేను జీవించలేను’ అంటారు. పరీక్షలకు ప్రిపేరవుతున్న మీకు ఆ మాటలు చిర్రెత్తించడం ఖాయం. వీళ్ల విషయంలో ఏం చేయాలంటే ముందసలు వాళ్ల సమస్య ఏమిటో కనుక్కోవాలి. ఆ క్రమంలో వాళ్లతో మీరు కూడా తలబిరుసుగానే ప్రవర్తించాల్సి ఉంటుంది.
 
కలెక్షన్‌ కింగ్స్‌
ఈ తరహా స్నేహితులకి అక్కర్లేని విషయం ఉండదు. ప్రతి ఒక్కరి గురించి, ప్రతీ విషయం గురించి ఉబుసుపోని కబుర్లు చెప్తుంటారు. అందరి మీదా తమదే పెత్తనం అన్న ట్టు వ్యవహరిస్తుంటారు. మీ స్నేహితుల్లో ఇటువంటి వాళ్లు ఉంటే మీరు కూడా వాళ్ల నోటికి ఒక సబ్జెక్టే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందుకని వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. లేదంటే మీ వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెరిచిన పుస్తకమే అవుతుంది.
 
గాబరా మనుషులు
ఇటువంటి వాళ్లు మీ జీవితంలోకి హరికేన్‌లా ప్రవేశించి గందరగోళాన్ని సృష్టిస్తారు. వాళ్ల సమస్యల్ని మీ సమస్యలా భావించాలి. కాని మీ సమస్య మాత్రం అసలు సమస్యే కాదనట్టు పరిగణిస్తారు. ఎప్పుడు చూసినా వాళ్ల గురించి, వాళ్ల సమస్యల గురించి లొడలొడా చెప్తుంటారు. మీ ఆలోచనలు వాటి చుట్టూరా తిరిగేలా చేస్తారు. వీళ్లని మీరెంత మారుద్దామన్నా మారరు. కాబట్టి వాళ్ల మానాన వాళ్లని వదిలేసి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లిపోవాలి.
 
అవసరానికి అందుబాటులో ఉండరు
వాళ్లకేదైనా అవసరమైతేనే మీతో మాట్లాడతారు, కలుస్తారు. లేదంటే మాత్రం కంటికి కనిపించరు. ఫోన్లో వినిపించరు. అవసరమై ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా స్పందించరు. ఇటువంటి వాళ్ల విషయంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ‘స్నేహం అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాల’ని. స్వలాభాల కోసం స్నేహం చేసే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
 
నొప్పించడమే పనిగా...
వాళ్లని వాళ్లు గొప్పగా చూపించుకునే క్రమంలో నలుగురి ముందు మిమ్మల్ని చులకన చేయడానికి ఏ మాత్రం వెనకాడని రకాలు వీళ్లు. మీ స్నేహితుల్లో ఇలాంటి వాళ్లు ఒక్కరు ఉంటే చాలు కలిసిన ప్రతిసారీ మనసు నొచ్చుకోవడం ఖాయం. స్నేహంలో ఒకరు గొప్ప మరొకరు తక్కువ అనేది ఉండదు. కాని మనసు నొప్పించే మనుషుల వల్ల అటువంటి భావనలు కలుగుతాయి. కాబట్టి వాళ్లని వెంటనే మీ స్నేహితుల గ్రూపు నుంచి పంపేయండి.