Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 04:27AM

విద్యార్థులకు తిరుగుండదు.. సీబీసీఎస్‌ అమలుతో ఎంతో మేలు

  •  టీచర్‌, స్టూడెంట్‌ మధ్య మెరుగైన బంధం
  •  ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలు
  •  యూజీసీ జాయింట్‌ సెక్రెటరీ జి.శ్రీనివాస్‌
హైదరాబాద్‌సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌).. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసిన నూతన విద్యా విధానం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నడుం కట్టిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన విధానానికి శ్రీకారం చుట్టి.. అమలుకు నిర్ణయించింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచే సీబీసీఎస్‌ను అమలు చేయాలని యూజీసీ ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, యూనివర్సిటీలు గానీ అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. దాని వెనకున్న కారణాలేంటి? అమలైతే విద్యార్థులకొచ్చే లాభం ఎంత? సీబీసీఎస్‌ జాప్యానికి గల కారణాలు.. నూతన విధానానికి అనుగుణంగా కాలేజీలు, యూనివర్సిటీలున్నాయా? వీటన్నింటిపై యూజీసీ జాయింట్‌ సెక్రెటరీ జి.శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. సీబీసీఎస్‌పై జేఎన్‌టీయూలో నిర్వహించిన సెమినార్‌కు హాజరైన ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
 
ఆంధ్రజ్యోతి: సీబీసీఎస్‌ అమలుపై గందరగోళానికి కారణమేంటి?
శ్రీనివాస్‌: సీబీసీఎస్‌ తెరపైకి వచ్చినప్పటి నుంచీ కొందరు కొన్ని సందేహాలను లేవనెత్తుతూనే ఉన్నారు. వాస్తవానికి దీనిపై ఎలాంటి గందరగోళం లేదు. దీని అమలుకు ప్రస్తుత వ్యవస్థ కన్నా పటిష్ఠమైన వ్యవస్థ అవసరం. కానీ ఆయా కాలేజీలు, యూనివర్సిటీల సామర్థ్యం అందుకు అనుగుణంగా లేకపోవడం వల్లే అనవసర చర్చలకు తెర తీస్తున్నారు. ఏళ్లుగా ఒక పద్ధతికి అలవాటు పడిన వారికి ఒక్కసారిగా కొత్త పద్ధతిని పరిచయం చేయడం వల్ల దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరిపడేంత స్టాఫ్‌ లేరని కొన్ని, ఈ విధానం అమలైతే తమపై అధిక భారం పడుతుందని మరికొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సీబీసీఎస్‌ అమలుకు సిద్ధాంత పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఉన్నవల్లా వారి వారి వ్యక్తిగత సమస్యలే.
 
దీనివల్ల విద్యార్థులకొచ్చే లాభమేంటి?
ప్రస్తుత విద్యా వ్యవస్థ టీచర్‌ ఒరియెంటెడ్‌. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సత్సంబంధాలు లేవు. కానీ సీబీసీఎస్‌ అందుకు పూర్తి భిన్నం. తరగతిలోని ప్రతి విద్యార్థికీ అక్కడి ప్రొఫెసర్‌తో ముఖాముఖి పరిచయం ఉంటుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య బంధాలు దృఢమవుతాయి. మెరుగవుతాయి. టీచర్‌ ఒరియెంటెడ్‌ నుంచి స్టూడెంట్‌ ఒరియెంటెడ్‌ విద్యా వ్యవస్థవైపు మనం అడుగులేయవచ్చు. దాదాపు అన్ని దేశాల్లోనూ సీబీసీఎస్‌ తరహా విధానాలే అమల్లో ఉన్నాయి. ఇక్కడా సీబీసీఎస్‌ ఉంటే మన విద్యార్థికి తిరుగుండదు. దేశ విదేశాల్లో ఉన్నతంగా రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక, సీబీసీఎస్‌ విధానానికి నూతన సిలబస్‌ అవసరం లేదు. కాకపోతే కొత్త పద్ధతికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి యూజీసీ సహకరిస్తుంది.
 
ఏయే స్థాయిల్లో సీబీసీఎస్‌ను ప్రవేశపెడుతున్నారు?
అండర్‌గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, పీజీ ఇలా అన్ని స్థాయుల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించాం. కోర్సులు, మాధ్యమాలతో ఎలాంటి సబంధం లేదు. టెక్నాలజీ కోర్సులకు, నాన్‌ టెక్నాలజీ కోర్సులకు ఇలా అన్నింటికీ ఈ విధానాన్నే అమలు చేస్తున్నాం. మన దేశంలో అనేక మాధ్యమాలు ఉన్నాయి. కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవట్లేదు.
ఎప్పటిలోగా అమలుచేస్తారు? యూజీసీ ఆదేశించినా కాలేజీలు స్పందించట్లేదెందుకు?
ఈ విద్యా సంవత్సరం(2015-16) నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. కానీ కాలేజీలు, యూనివర్సిటీలు ముందుకు రావడం లేదు. దీనిపై కొందరు అతిగా ఊహించుకోవడమే అందుకు కారణం. ప్రస్తుత వ్యవస్తకు ఇది ఇంప్రూవ్‌మెంట్‌ మాత్రమే. అంతే కానీ విద్యా విధానం మొత్తం మారదు. ఈ ఏడాది నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) గల కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయాలని జేఎన్‌టీయూ నిర్ణయించినా.. పలు సమస్యల వల్ల పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. కానీ, ఎప్పటికైనా అందరూ సీబీసీఎస్‌ను అమలు చేయాల్సిందే.
 
నిబంధనలు సమస్యగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి?
ఏఐసీటీఈ, యూజీసీ విధానాల్లో కొంత తేడా వాస్తవమే. కానీ అవి సీబీసీఎస్‌ విధానాన్ని ప్రభావితం చేసేంతగా లేవు. రెండు సంస్థల నిబంధనలు 90 శాతం ఒకటే. మిగతా పది శాతం సీబీసీఎస్‌ అమలులో ఆయా కాలేజీలు, యూనివర్సిటీలకు సమస్యగా మారితే వాటిని మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. అందుకోసమే 30 శాతం నిబంధనల్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించాము. ఈ ఏడాది నుంచి పాక్షికంగా అమలు చేసినా.. వచ్చే ఏడాది నుంచి మాత్రం పూర్తి స్థాయి అమలుకు చర్యలు తీసుకుంటాం.
 
ఈ విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటి?
అంతా కలిసి పని చేసి అమలు చేస్తేనే సీబీసీఎస్‌ విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చొరవ తీసుకోవాలి. మేం కూడా సెమినార్‌లు నిర్వహించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.