Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 11:09AM

వేడెక్కిన నట రాజకీయం!

ఓ పక్క తమిళనాడు ఉప ఎన్నికల్లో జయలలిత విజయఢంకా మోగించి మరోసారి తన సత్తా చాటుకుంది. మరో పక్క నడిగర్ సంఘం ఎన్నికలు కోర్ట్ స్టే కారణంగా వాయిదా పడినా వేడిని మాత్రం చల్లార్చలేకపోతున్నాయి. ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు శరత్ కుమార్, రాధారవి పై యువ కథానాయకులు విశాల్, కార్తీ కత్తి కట్టినట్టే కనిపిస్తోంది. వీరిద్దరూ సీనియర్ నటుడు నాజర్ ను తమ పావుగా రంగంలోకి దించారు. ఇదే నెలలో జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలపై మద్రాస్ హైకోర్ట్ స్టే ఇచ్చింది. అయినా సినీజనం రాజకీయ నాయకుల మాదిరి వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నారు. శరత్ కుమార్ వర్గంపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, కానీ నడిగర్ సంఘం స్థలాన్ని ప్రైవేట్ పార్టీకి మల్టీప్లెక్స్ నిర్మాణం కోసం లీజు కివ్వడంపై అభ్యంతరం ఉందని విశాల్ వర్గం స్పష్టం చేస్తోంది.
కోలీవుడ్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా... శరత్ కుమార్ ముందు ఉంటాడనే పేరుంది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఆయన సేవలను మరువలేమని చాలామంది చెబుతుంటారు. కానీ కుర్ర హీరోలు మాత్రం శరత్ కుమార్ బృందంపై మండి పడుతున్నారు. సంస్థ నియమ నిబంధనలకు ప్రస్తుత కమిటీ పాతరేసిందని చెబుతున్నారు. నటీనటుల కోసం సొంత భవనాన్ని కట్టి ఇస్తానని రాతపూర్వకంగా శరత్ కుమార్ హామీ ఇస్తే... తాను ఎన్నికల్లో పోటీ చేయనని విశాల్ సవాల్ విసిరాడు. మరో వైపు నడిగర్ సంఘం ఎన్నికలు జరిపించి, తన సత్తా చాటుకోవాలని శరత్ కుమార్ ఉవ్విళ్ళూరుతున్నాడు. అందుకే కోర్ట్ స్టే ఆర్డర్ పై కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారకముందే... రజనీకాంత్, కమల్ హాసన్ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని చాలామంది నటీనటులు కోరుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు పెద్దలు ఏ మేరకు జోక్యం చేసుకుంటారో చూడాలి.