
జిఎఎఆర్ఇ చీఫ్ మెంటార్ యశ్వంత్ జబాక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే మూడేళ్ల పాటు దేశీ ఆటోమొబైల్ రంగంలో ఏటా 15,000 మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఉందని గ్లోబల్ అకాడమీ ఆఫ్ ఆటోమోటివ్ రిటైల్ ఎక్స్లెన్నీ (జిఎఎఆర్ఇ) చీఫ్ మెంటార్ యశ్వంత్ జబాక్ చెప్పారు. తమ సంస్థ ప్రవేశపెడుతున్న ‘అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఆటోమోటివ్ రిటైల్ సేల్’ కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ గ్యారెంటీ ఇస్తామని ఆయన చెప్పారు. పుణెలో గత నెల 11న జిఎఎఆర్ఇని ప్రారంభించామని, ఈ నెల 15 నుంచి డిప్లొమా క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామని ‘ఆంధ్రజ్యోతి బిజినెస్’కు తెలిపారు.
ఎవరైనా అర్హులే : అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఆటోమోటివ్ రిటైల్ సేల్ కోర్సు కాలపరిమితి ఆరునెలలు. తొలి బ్యాచ్ జూలై 15న ప్రారంభం అవుతుంది. తాజా గ్రాడ్యుయేట్లు, ముందస్తు అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్‌లు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. డీలర్స్ స్పాన్సర్ చేసేవారికి 2-4 వారాల స్వల్పకాలిక శిక్షణ ఇస్తారు. ఆన్లైన్లో నిర్వహించే సాధారణ పరీక్ష ద్వారా కోర్సుకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినవారికి జిఎఎఆర్ఇ సర్టిఫికెట్తో పాటు ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఎస్డిసి) నుంచి ఒక సర్టిఫికెట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ‘బిజినెస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్’ సర్టిఫికెట్ అందిస్తారు. అనంతరం సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఆటోమోటివ్ డీలర్ల వద్ద ఉద్యోగం ఇప్పిస్తారు.
100 శాతం విద్యారుణం : ఆరునెలల అడ్వాన్స్డ్ డిప్లమా ఇన్ ఆటోమోటివ్ రిటైల్ సేల్ కోర్సుకు 1.2 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తామని జిఎఎఆర్ఇ ఇడి వికాస్ జబాక్ చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన అభ్యర్ధుల కోసం జనతా సర్కారీ బ్యాంకు నుంచి విద్యారుణం ఇప్పిస్తామని చెప్పారు. కోర్సు ఫీజుకు, ఆరునెలల పాటు వసతికి కలిపి బ్యాంకు నుంచి దాదాపు 2.25 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తామన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి రుణ వాయిదాలు (ఈంఐ) చెల్లించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఈ నెల పదిలోపు ఆన్లైన్ పరీక్షకు హాజరుకావాలన్నారు.