desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 02:58AM

మా కాలేజీలకే అనుమతులివ్వరా.. సీఎం వద్దే తేల్చుకుంటా!
కడియంపై పల్లా గరంగరం.. తీవ్ర వాగ్వాదం

  •  అంతే దీటుగా కడియం స్పందన
  • సీఎం జోక్యంతో సద్దుమణిగిన వివాదం
  • మధ్యేమార్గంగా ఒక్కో బ్రాంచ్‌ కోత
  • అఫిలియేషన్‌ కొనసాగింపు!
హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతి వ్యవహారం టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వివాదం రాజేసింది. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌), సీట్ల ఖరారుపై టీఆర్‌ఎ్‌సకు చెందిన విద్యా సంస్థల అధినేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ అంశంపై గత మూడు రోజులుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం, వాదోపవాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ కాలేజీల అనుమతుల వ్యవహారంలో జేఎన్‌టీయూహెచ్‌ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీపై రెండుసార్లు తనిఖీలు నిర్వహించింది. ఈ నెల 27వ తేదీ సాయంత్రానికి తనిఖీలు పూర్తి చేసి కాలేజీల అఫిలియేషన్‌, సీట్ల సంఖ్య జాబితాను సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు కాలేజీల్లో కూడా లోపాలు ఉన్నాయని, ఒక కాలేజీలో 12 మంది అధ్యాపకులు తక్కువగా ఉన్నారని జేఎన్‌టీయూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే... తమ కాలేజీలో ఇద్దరు ఫ్యాకల్టీ మాత్రమే తక్కువగా ఉన్నారని, అంత మాత్రానికే గుర్తింపు ఆపివేస్తారా అని పల్లా ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోనే వాగ్వాదం జరిగినట్లు తెలసింది. ‘మా కాలేజీకే అనుమతులు ఇవ్వరా? పార్టీ కోసం నేను ఎంతో చేశాను. చిన్న చిన్న లోపాలకే బ్రాంచీల్లో కోత విధిస్తారా? మా కాలేజీకి అనుమతి ఇవ్వాల్సిందే. లేదంటే సీఎం వద్దే తేల్చుకుంటా’’ అని పల్లా పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. ‘‘సీఎంకు నేను కూడా చెబుతా. నీకు అనుమతి ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుంటే నాకు అపవాదు వస్తుంది. నాకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ తర్వాత... పల్లా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం, ఆయన జోక్యం చేసుకోటంతో వివాదం సద్దుమణిగినట్లు తెలిసింది. లోపాలు ఉన్నట్లు గుర్తించిన కాలేజీలో... బీటెక్‌లో ఒకటి, ఎంటెక్‌లో ఒక బ్రాంచీకి కోత విధించి అనుబంధ గుర్తింపు కొనసాగించినట్లు సమాచారం. కాలేజీల అనుబంధ గుర్తింపు వివరాలను జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ఆదివారం అర్ధరాత్రి అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తొలగించారు.
వాగ్వాదం జరగలేదు: పల్లా
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ఎలాంటి వాగ్వాదం జరగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘వివిధ పనులపై తరచూ డిప్యూటీ సీఎంను కలుస్తుంటా. ఆయనతో వాగ్వాదం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంజనీరింగ్‌ కాలేజీల అనుమతులపై జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారు. నా కాలేజీల్లో కూడా ఎంటెక్‌, బీటెక్‌లో కొన్ని సీట్లు తగ్గించారు. అంత మాత్రాన వాగ్వాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. తన కాలేజీల్లో ఎలాంటి లోపాలు లేవని, ఉన్నట్లయితే తానే స్వయంగాసీట్లు రద్దు చేసుకుంటానని స్పష్టం చేశారు. కొంత మంది బయటి వ్యక్తులు కుట్రలు చేసి తన కాలేజీలు అపఖ్యాతి పాలయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.