Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 02:16AM

స్మితాసభర్వాల్‌పై అసభ్య క్యారికేచర్‌... ‘ఔట్‌లుక్‌’పై స్మిత చర్యలు

  • లీగల్‌ నోటీసు పంపిన ఐఏఎస్‌ స్మితాసభర్వాల్‌
  • పత్రిక తాజా సంచికలో క్యారికేచర్‌ కలకలం
హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ఐఏఎస్‌ అధికారి స్మితాసభర్వాల్‌పై ‘ఔట్‌లుక్‌ ’ ఆంగ్ల మ్యాగజైన్‌ ‘డీప్‌త్రోట్‌’ పేరిట తాజా సంచికలో అసభ్యరీతిలో క్యారికేచర్‌ ప్రచురించడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ఆమె అభ్యంతరకర దుస్తులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా... సీఎం కేసీఆర్‌ ఫొటో తీస్తుంటే కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నట్లు ముద్రించింది. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మల దృష్టికి తీసుకెళ్లటంతోపాటు తోటి అధికారులవద్ద ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేనివారే ఈ పనిచేయించారని ఆక్షేపించారు. మరోవైపు ఔట్‌లుక్‌ తీరుపై అఖిలభారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులు స్పందించారు. సదరు పత్రికపై చర్యలు తీసుకోవాలని వారి సంఘం ప్రతినిధులు మంగళవారం సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- ‘కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు. అలాగే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కూడా సీఎస్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఔట్‌లుక్‌పై ‘క్రిమినల్‌ కేసు’ పెట్టాలని యోచిస్తున్నారు. మరోవైపు స్మితాసభర్వాల్‌ మంగళవారం ఆ పత్రికకు లీగల్‌ నోటీసు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా క్యారికేచర్‌ ప్రచురించడంపై 15 రోజుల్లోగా తదుపరి సంచికలో క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రెవెన్యూ జేఏసీ ఆమెకు సంఘీభావం ప్రకటిస్తూ ఔట్‌లుక్‌పై మండిపడింది. పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.