Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 01:09AM

ఉప ఎన్నికలో జయ ఘన విజయం

  • ఆర్కేనగర్‌లో 1.5 లక్షల ఓట్ల భారీ ఆధిక్యం
  • ఐదు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఉప ఎన్నికలు
  • అన్నిచోట్లా అధికారపార్టీలకే ఓటర్ల పట్టం
న్యూఢిల్లీ, జూన్‌ 30: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలలో అధికార పార్టీలకే ఓటర్లు పట్టంగట్టారు. ఈ మేరకు మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో తమిళనాడులోని ఆర్కేనగర్‌ నుంచి అన్నా డీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప సీపీఐ ప్రత్యర్థి సి.మహేంద్రన్‌పై 1,50,722ఓట్ల భారీ ఆధిక్యంలో నిలవగా, ఆయనసహా ప్రత్యర్థులందరూ ధరావతు కోల్పోయారని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ప్రజలు తనకు తిరుగులేని విజయం కట్టబెట్టడంపై జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ గెలుపు నాకు చరిత్రాత్మకమైనది. ఓటర్ల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తా’’ అన్నారు. ఫలితాలు ప్రకటించగానే ఆమె ఈ మేరకు స్పందించారు. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో ప్రజాప్రతినిధిగా జయ అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో గతనెల 23న మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. అటుపైన ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండటంతో అధినేత్రి కోసం ఆర్‌.కె.నగర్‌ ఎమ్మెల్యే పి.వెట్రివేల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని ప్రతాప్‌గఢ్‌, సుర్మా స్థానాల్లో సీపీఎం అభ్యర్థులు రాము దాస్‌, అంజన్‌దాస్‌లు తమ సమీప బీజేపీ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కేరళలోని అరువిక్కరలో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఎస్‌.శబరినాథన్‌ తన సమీప సీపీఎం ప్రత్యర్థి విజయకుమార్‌పై గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లోని గరోత్‌లో బీజేపీ అభ్యర్థి చందర్‌ సింగ్‌ సిసోడియా తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి సుభాష్‌కుమార్‌ సొజాతియాపై నెగ్గారు. మేఘాలయలోని చోక్‌పోత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బ్లూబెల్‌ ఆర్‌.సంగ్మా తన సమీప నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ప్రత్యర్థి ఫిలిపోల్‌ మారక్‌పై గెలిచారు.