Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2015 @ 15:51PM

కేసీఆర్‌ అండతోనే గద్వాల్‌లో వైసీపీ క్యాంప్‌ : రావెల

హైదరాబాద్‌, జున్‌ 30 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండతోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా, గద్వాల్‌లో క్యాంప్‌ నిర్వహిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్వాల్‌లోనే ఎందుకు పెట్టుకోవాలని, కర్నూల్‌లోనే క్యాంప్‌ పెట్టుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. దీని బట్టి చూస్తే కేసీఆర్‌, జగన్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందని అర్థమవుతోందని, ఆ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

క్యాంప్‌ పేరుతో ఏపీ వైసీపీ ప్రజాప్రతినిధులను గద్వాల్‌లో దాచడం విడ్డూరంగా ఉందని మంత్రి రావెల అన్నారు. స్టింగ్‌ ఆపరేషన్లు నేరమని సుప్రీం కోర్టు చెప్పినా పట్టించుకోరా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాలపై కేసీఆర్‌, జగన్‌లకు నమ్మకం లేదని రావెల మండిపడ్డారు. నియంతృత్వం ఎంతోకాలం నిలవదని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అప్రతిష్టపాలు చేయాలని వారిద్దరూ కుట్ర చేస్తున్నారని రావెల కిషోర్‌బాబు ధ్వజమెత్తారు.

టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడం కూడా మా నైతిక విజయమని మంత్రి రావెల అన్నారు. రేవంత్‌కు బెయిల్‌ రాకుండా ఎన్నో కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఆ కుట్ర రాజకీయాలకు మీరే బలౌతారని ఆయన అన్నారు.