Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 29 2015 @ 14:04PM

వాయిదా పడిన 'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయ చిత్రాల సరసన చోటు దక్కించుకుంది 'బాహుబలి' చిత్రం. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం రెండున్నరేళ్ళుగా రాజమౌళి బృందం కష్టపడుతోంది. 'బాహుబలి' విడుదల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులూ ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. అయితే వీరి ఎదురు చూపులకు జూలై 10న ఫుల్ స్టాప్ పడబోతోంది. దీనికి నలభై రోజుల ముందే కీరవాణి స్వరపరిచిన గీతాలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నెల 31న జరగాల్సిన ఆ ఆడియో వేడుక ఊహించని విధంగా వాయిదా పడింది. అభిమానులను ఇబ్బంది పెట్టకూడదనే ఈ వేడుకను రద్దు చేశామన్నారు రాజమౌళి.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'బాహుబలి' చిత్రాన్ని మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నది నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్లాన్. ఇందులో భాగంగానే ఇటీవల కాన్స్ లో ఈ సినిమాకు సంబంధించిన పదినిమిషాల ఫుటేజ్ ను అక్కడి పంపిణీదారులకు ప్రదర్శించారు. వారి నుండి మంచి స్పందన లభించిందని శోభు తెలిపారు. తెలుగు ఆడియో వాయిదా పడినా, ముందుగా అనుకున్న విధంగా జూన్ 1న ముంబైలో 'బాహుబలి' హిందీ ట్రైలర్ విడుదల కానుంది. అలానే సినిమానూ ఎట్టిపరిస్థితుల్లో జూలై 10న రిలీజ్ చేస్తామంటున్నారు. ఇక సినిమా టిక్కెట్ రేట్లు పెంచబోతున్నామంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. 'బాహుబలి' కోసం తాము వెచ్చించిన కాలం, ధనం రెండూ కూడా తగిన ప్రతిఫలాన్ని ఇస్తాయనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'బాహుబలి' ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి!!