Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అలబ్ధ వాఙ్మయం’ మనకు ఆదికవితోనే మొదలైంది!

సాహిత్యంలో దొరికినది ఎంత వుందో, దొరకకుండా ‘పోయినది’ అంతకు ఏమాత్రం తక్కువ కానంతగా ఉన్నదన్న మాట సాహిత్యాభిలాషులలో ప్రసిద్ధమయ్యే వుంది. ‘తెలుగులో అలబ్ధ వాఙ్మయం’ అనే పేరుతో 1993లో ఒక పుస్తకం ప్రచురించుకోవడానికి సరిపోయినంతగా మనకు ‘పోయిన’ సాహిత్యం వుంది. వేరే ఏ భాషా సాహిత్యంలోనూ ఈ తరహా సాహిత్య గ్రంథం ఒకటి వుండడం అన్నది నా దృష్టికి ఇంతవరకూ రాని సంగతి. నిలబడ గలిగే సత్తా వున్న రచనలే నిలిచి, నిలబడ గలిగిన విషయ సంపద లేనివే పోయాయనుకుందామనుకున్నా, ఈ ‘పోవడం’ అన్నది తెలుగులో లిఖిత సాహిత్యం ఎవరితో మొదలయిందని మనం తీర్మానించుకున్నామో ఆ ఆదికవి నన్నయ రచనలతోనే మొదలవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాక మరేమవుతుంది! నన్నయ వంటి ప్రతిభావంతుడైన కవి రచించిన గ్రంథం ఏదైనా కాలంలో నిలబడకుండా ‘పోవడానికి’ సత్తా లేనిది ఎలా అవుతుంది? అనేది ప్రశ్న. అలా నిలబడకుండా ‘పోయిన’ నన్నయ రచనలలో ‘చాముండికా విలాసము’ ఒకటి. నన్నయభట్టారకుని ఈ రచన సరిగ్గా ఎప్పటినుంచి మనకు అందుబాటులో లేకుండా పోయింది? అని ప్రశ్నించుకుని, కాస్త శ్రమచేసుకుని కాలంలో వెనక్కి వెళ్ళి, వెదికే ప్రయత్నం చేస్తే తెలిసే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ‘చాముండికా విలాసము’ అనే నన్నయ రచన 1917 సంవత్సరం దాకా మనకు అందుబాటులోనే వుందని, అప్పటికి రెండు తాళపత్ర ప్రతులు ఆంధ్ర దేశంలోని ఇరువురు పండితుల వద్ద అందుబాటులో వుండేవనీ, వారిలో ఒకరు శతావధాని దివాకర్ల తిరుపతిశాస్త్రిగారైతే (ఈ సంగతినీ, విషయ సంగ్రహంతోపాటు, ఆ గ్రంథానికి సంబంధించిన ఇతర ముఖ్య వివరాలనూ సంక్షిప్తంగా ఆనాటి ఒక ప్రముఖ దినపత్రికకు లేఖ ద్వారా తెలిపినవారు కాకినాడ వాస్తవ్యులైన దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు), రెండవవారు పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారని (ఇది వారు బళ్ళారి ప్రాంతం నుంచి సేకరించారని అదే దినపత్రికకు వారు కూడా ఒక లేఖ ద్వారా తెలియజేశారు). ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ ఇది! 1917వ సంవత్సరానికి రెండు తాళపత్ర ప్రతులలో పూర్తి గ్రంథం అందుబాటులో వున్న 11వ శతాబ్దపు నన్నయ రచన, అంతలోనే అలబ్ధమైపోయి, అలబ్ధమైనదిగా తీర్మానించబడి, 1993లో ప్రచురించబడిన ‘తెలుగులో అలబ్ధ వాఙ్మయం’ గ్రంథంలో చోటు దక్కించుకుంది. ఈ పరిణామాన్ని ఏమనాలి? తిరుపతి శాస్త్రిగారి వద్ద ఒక తాళపత్ర ప్రతి వున్నదని మాటలతో చెప్పడమే కాదు, అందులోనిదైన మొదటిపద్యం ఇలా వుందని వుదాహరించబడింది: 

శా.శ్రీవాణీ గిరిజాసమన్వితుల సుక్షేమస్థితిన్‌ సృష్టిహృ

ద్భావత్ర్పౌఢిమ కార్యకారణుల విభ్రాజాదినీలోపమా

సౌవర్ణాభసితాభ్ర సాంమ్యవర్ష స్థైర్యభ్రసంవాహులన్‌

సేవింతున్‌ మది నా త్రిమూర్తులను చిత్తంబులో నెప్పుడున్‌.


ఈ పద్యం నన్నయ ఆంధ్ర మహాభారతం ఆరంభంలో (సంస్కృత భాషలో కనుపించే మంగళ శ్లోకమైన) ‘శ్రీవాణీగిరిజాశ్చిరాయ...’కు తెలుగు భాషాంతరీకరణం అనిపిస్తుందని చెప్పడానికి పెద్ద ప్రయత్నమేమీ అవసరం లేదు కదా! ఏ కారణం చేతనో తెలుగు పద్యంగా ఈ భావాన్ని సంతృప్తి చెందని నన్నయ, మక్కువతో ఇదే భావాన్ని సంస్కృత శ్లోక రూపంగా ఆంధ్ర భారతంలో చేర్చాడని అర్థంచేసుకోవడానికి కూడా పెద్దగా సంకోచించాల్సింది లేదు కదా! ఈ గ్రంథంలో కడప మండలము నందలి నందవరమనే ప్రదేశంలో వెలసియున్న చాముండికామాహత్మ్యము పురాణపక్కిలో తెలియజేయబడినదనీ, ఇందులో మూడు ఆశ్వాసములు వున్నాయనీ, గ్రంథం మొత్తం మీద పద్యముల కన్న వచనమే ఎక్కువనీ మిగతా విషయాలు తెలియజేశారు. ఆశ్వాసాంత గద్యలో కవి ఈ విధంగా వ్రాశారనీ తెలియజేయబడింది - ‘‘ఇది సకల భాషావాగనుశాసన నన్నయభట్ట విరచితంబైన  చాముండికా విలాసంబునందు ప్రథమాశ్వాసము.’’ సోమవంశ సంభవుడైన నందనచక్రవర్తి నందవరము నేలుచున్న కాలమునాటి కథ ఇందులో వర్ణితము. నన్నయకు మహాభారతం ఆంధ్రీకరణకు ముందు రచన ఇది. అప్పటి నన్నయ పద్య శైలి తెలియడానికై ఈ కావ్యంలోని ద్వితీయాశ్వాసము నుండి ఉదాహరించబడిన మరొక పద్యం ఈ క్రిందిది: 

మ. ఎక్కడ దీని యున్నతమిదేమని యెంచదరంబు చూడ సొం

పెక్కగ దీని శాఖలను నెన్నడుఁ బాయదు పక్షి పంక్తిమే

మెక్కడనైన నిట్టి తరువెన్నడు జూడగలేదటంచు నా

రక్కసి రాజులందరును రావిని మెచ్చినుతించిరంతటన్‌.

చివరన, ఈ గ్రంథం ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమునకు లభ్యమైనట్లుగా కనబడదని కూడా తెలియజేయబడడం ఒక విశేషం. 


అలా, 1917 సంవత్సరం నాటికి (ఒకటి కాదు) రెండు తాళపత్ర  ప్రతులలో మూడు ఆశ్వాసముల పూర్తి కావ్యం (ఎక్కడో దేశాంతరాలలో కాకుండా, ఈ ఆంధ్ర దేశంలోనే) ఇరువురు ప్రసిద్ధ పండితుల వద్ద అందుబాటులో వుండినట్లుగా తెలిపే ఇన్ని వివరాలు వుండగా, ఈ ‘చాముండికా విలాసము’ అనే నన్నయ రచన అంతలోనే ‘అలబ్ధ వాఙ్మయం’ లోకి ఏ విధంగా చేరిపోయిందో, ఆనాటి ఆంధ్రదేశపు పండితులకు, ఆ దేమునికి మాత్రమే తెలియాలి.

భట్టు వెంకటరావు


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...