Abn logo
Sep 27 2020 @ 02:53AM

వాన వెల్లువ

Kaakateeya

జిల్లాలో విస్తారంగా వర్షాలు..! 

పొంగిపొర్లిన వాగులు, వంకలు 

ఒక్క రోజులో రూ.3.6 కోట్లకుపైగా పంట నష్టం


అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు: వాన వెల్లువెత్తింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం దాకా ఎడతెరిపి లేకుండా పలు మండలాల్లో వాన కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దవడుగూరు మండల కేంద్రంలోని పందుల వాగు పెద్ద వంకతోపాటు గుత్తి అనంతపురం, ఆలంపల్లి సమీపంలోని వంకలు ఉధృతంగా ప్రవహించాయి. విడపనకల్లు మండలంలో డొణేకల్లు వంక, యాడికి మండలంలోని నిట్టూరు వద్ద వంక ఉధృతంగా ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దవడుగురులో అత్యధికంగా 70.4 మి.మీ., వర్షపాతం నమోదైంది. విడనపకల్లు 67.4, వజ్రకరూరు 41.0, గుత్తి 45.4, పామిడి 60.4, యల్లనూరు 54.0, బత్తలపల్లి 40.2, నంబులపూలకుంట 52.6, పుట్లూరు 42.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 37.4 మి.మీ.,లోపు పడింది. ఈనెల జిల్లా సగటు వర్షపాతం 118.4 మి.మీ., కాగా ఇప్పటి దాకా 205.2 మి.మీ., కురిసింది. 


ఒక్కరోజులో 1624 హెకార్లలో పంట నష్టం 

జిల్లావ్యాప్తంగా ఒక్క రోజులోనే రూ.3.60 కోట్లకుపైగా విలువైన 1624 హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. 18 మండలాల పరిధిలో వేరుశనగ 1483 హెక్టార్లు, ప్రత్తి 124, వరి 13.6, మొక్కజొన్న 4 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. నెలారంభం నుంచి ఇప్పటిదాకా 3300 హెక్టార్లలో రూ.9 కోట్లకుపైగా విలువైన పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. చేతికొచ్చిన వేరుశనగ పంట దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement