Abn logo
Oct 24 2021 @ 01:45AM

కల తీరకనే

సంధ్య మృతదేహం

వర్షపు నీటిలో చిక్కుకుని యువతి మత్యువాత


స్థానికుల సాయంతో బయటపడ్డ కుటుంబసభ్యులు


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 23: ఆమె రెండేళ్లక్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లైననాటి నుంచి తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలని ఆశపడింది. అనుకున్నట్టుగానే కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వారితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చింది. కాని తిరుపతిలో వర్షపు నీరు మృత్యుకూపమైంది. డ్రైవరు అతి విశ్వాసం యమపాశమైంది.  చివరకు శ్రీవారిని దర్శించుకోకుండానే ఆమె విగతజీవిగా మారిపోయింది. ప్రమాదపుటంచుల్లోకి వెళ్లిన రెండేళ చిన్నారి, ఇతర కుటుంబసభ్యులు మాత్రం క్షేమంగా బయటపడగలిగారు. ఎస్వీయూ సీఐ రవీంద్రనాథ్‌  కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా, మదుగూరుకు చెందిన భాగ్యశ్రీ కుమార్తె సంధ్య(28), సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ భార్యాభర్తలు. వీరు రాయచూరు లింగనూరులో కాపురం ఉంటున్నారు. రెండేళ్లక్రితం వివాహమైనప్పటి నుంచి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి శ్రీవారి దర్శనానికి రావాలని సంధ్య ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శనివారానికి శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్ల లభించడంతో హరీష్‌, సంధ్య, ఆమె చెల్లెలు సౌమ్య, ఆమె కుమారుడు సుజిత్‌, అమ్మమ్మ భాగ్యశ్రీ తుఫాన్‌ వాహనంలో గురువారం రాత్రి  బయలుదేరారు. మొదట వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు. తరువాత శుక్రవారం ఉదయం కంచికి చేరుకున్నారు. బెంగుళూరులో ఉంటున్న సంధ్య అక్క సువర్ణ, ఆమె భర్త వినోద్‌కుమార్‌, కుమార్తె బిన్మయి కలుసుకున్నారు. అందరూ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని శుక్రవారం రాత్రి తిరుమలకు బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరుపతికి చేరుకున్నారు. ఆ సమయంలో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరువాన కురుస్తోంది. ఉప్పరపల్లె, మహిళా వర్శిటీ మీదుగా వారు నగరంలోకి ప్రవేశించారు. వెస్ట్‌ చర్చి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్దకు వచ్చేటప్పటికి వంతెన కింద వర్షపునీరు నిండుగా ఉంది. అయినప్పటికీ డ్రైవర్‌ హనుమంతు వాహనాన్ని బ్రిడ్జి దాటించేందుకు ముందుకే పోనిచ్చాడు. మెలకువతోనే ఉన్న భాగ్యశ్రీ వద్దని డ్రైవర్‌ను వారించింది. నీళ్లను సులభంగా దాటేస్తామని, భయపడాల్సింది లేదంటూ హనుమంతు వాహనాన్ని నీళ్లలోకి దించాడు. ఐతే క్షణక్షణానికి నీటి వరద పెరుగుతుండడంతో ముందుకు పోదామనుకున్న డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. పొగగొట్టంలోకి నీళ్లు చేరడంతో ఇంజన్‌ ఆగిపోయింది. మరోపక్క వరద నీరు అంతకంతకూ వచ్చి వాహనం మునిగిపోవడం ప్రారంభించింది. అదే సమయంలో అక్కడికి దూరంగా ఉన్న ఇద్దరు యువకులు గమనించి హుటాహుటిన రంగంలోకి దిగారు. సాయమందిస్తూనే పోలీసులకు సమాచారం చేరవేశారు. సంధ్య భర్త హరీష్‌, బావ వినోద్‌కుమార్‌, డ్రైవర్‌ హనుమంతు, స్థానిక యువకులు అందరూ కలిసి వాహనంలోని వారిని కష్టంమీద ఒడ్డుకు చేర్చారు. అందరూ క్షేమంగా బయటపడ్డారనుకుంటున్న సమయంలో సంధ్య లేదని గుర్తించి ఆమె బావ వినోద్‌కుమార్‌ ఈదుకుంటూ వాహనం వద్దకు వెళ్లి చూశాడు. బయట పడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న సంధ్యను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ఆమె నీళ్లు బాగా తాగేసి ఉండటంతో అక్కడికి చేరుకున్న పోలీసు వాహనంలో రుయాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి బిన్నయి కూడా నీళ్లు తాగేయడంతో ఆమెను చిన్నపిల్లల వార్డులో చేర్చారు. ఆమె కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది. శ్రీవారి దర్శనానికి బయలుదేరిన కుటుంబం చివరకు రుయా మార్చురీ వద్ద భోరున విలపిస్తున్న దృశ్యాలు స్థానికులను కలచివేశాయి. నిత్యం వేలాదిగా ప్రజలు తిరిగే నడి రోడ్డులో ఓ ప్రాణం జల సమాధి కావడం చర్చనీయాంశమైంది. సీఐ రవీంద్రనాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


భక్తుల ప్రాణాలను కాపాడిన యువకులకు అభినందన

తిరుపతి వెస్ట్‌ చర్చి అండర్‌ బ్రిడ్జి వద్ద జరిగిన ఘటనపై ఎంపీ గురుమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి రైల్వే, కార్పొరేషన్‌ అధికారుల తీరుపై మండిపడ్డారు.ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని ఆదేశించారు. అదేవిధంగా బ్రిడ్జి కింద చిక్కుకున్న కర్ణాటక భక్తులను కాపాడిన స్థానిక యువకులు శ్రీనందన్‌, మునికిరణ్‌, లక్ష్మీకాంతం, దినేష్‌లను అభినందించారు. సంఘటనా ప్రాంతాన్ని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ గిరీష పరిశీలించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని  ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద వర్షపునీటిలో మునిగిపోయిన వాహనం


తిరుమల యాత్రకు బయల్దేరిన సంధ్య బృందం