Advertisement
Advertisement
Abn logo
Advertisement

కష్టాల్లో ఓర్పే ఆయుధం

మనిషి జీవితంలో అనేక ఒడుదొడుకులు, కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు... ఇవన్నీ కలగలుపుగా ఉంటాయనేది సత్యం. ఒక్కొక్కసారి దైవం నిష్కళంకులైన భక్తులపై కరుణ కురిపిస్తాడు. అలాగే కష్టాలు, ఆందోళనలు కూడా వర్షింపజేస్తాడు. ‘‘ఓ దేవా! నీవు నీ భక్తులైన వారికే అనేక కష్టాలు కలిగిస్తావు. వారినే ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నావు. నీకు నమ్మకమైన భక్తులు అన్నిటికీ నీమీదే ఆధారపడతారు. అలాంటివారిని ఎందుకు కష్టాలపాలు చేస్తున్నావు?’’ అని దైవ దూతలు ఒకసారి అల్ల్లాహ్‌ను అడిగారు.


దానికి అల్లాహ్‌ బదులిస్తూ ‘‘నా ప్రియ భక్తులు ఈ లోకంలో కష్టాలను అనుభవించి... విశ్రాంతి కోసం మార్గాన్ని సులభతరం చేసుకుంటున్నారు. తద్వారా పరలోకంలో వారికి అన్ని విధాలా శుభాలు సమకూరుతాయి. తీర్పు రోజున... పవిత్రంగా, ఎలాంటి మచ్చా లేకుండా, పాపాల నుంచి విముక్తి పొంది నా వద్దకు రాగలరు. అందుకోసమే నా ప్రియభక్తులను కష్టాలకూ ఆందోళనలకూ గురి చేస్తున్నాను’’ అని చెప్పాడు.


ఈ ప్రపంచంలో ప్రవక్తలకన్నా దైవానికి అత్యంత ప్రియమైనవారు, ప్రేమాస్పదులు ఎవరుంటారు? వారు దేవునికి ఎంతో ఆప్తులు. వారితో ఆయనకు దగ్గర సంబంధం ఉంటుంది. దేవుడి సందేశాన్ని ప్రజలకు అందజేసేవారు ప్రవక్తలే. కానీ, దైవానికి ఎంత దగ్గరవారైతే... అంత అధికంగా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు హజ్రత్‌ ఇబ్రహీం అలైహిస్సలాం జీవితాన్నే గమనిస్తే... ఆయనకు ‘ఖలీలుల్లాహ్‌’ అంటే ‘అల్లాహ్‌కు మిత్రుడు’ అనే బిరుదు ఉంది. కానీ ఆయనను ఎన్నో కష్టాలు, అనంతమైన బాధలు, అంతులేని ఆవేదనలు చుట్టుముట్టాయి. భయంకరమైన అగ్నిగుండంలో పడాల్సి వచ్చింది. ఇటువంటివన్నీ తట్టుకున్నవారే పరలోకంలో సుఖాన్ని పొందుతారు. కాబట్టి వాటిని తట్టుకుంటూ, ఓర్పే ఆయుధంగా ముందుకు సాగడమే ఉత్తమం. 


ఒకసారి దైవప్రవక్త మహమ్మద్‌ సన్నిధికి ఒక మహిళ వచ్చింది. ‘‘నాకుమూర్ఛ వ్యాధి ఉంది. అది తలెత్తినప్పుడు నా ఒంటి మీద ఆచ్ఛాదన తొలగిపోతోంది. ఆ వ్యాధి నయం కావాలని నా కోసం ‘దుఆ’ (ప్రార్థన) చెయ్యండి’’ అని విన్నవించుకుంది.


అప్పుడు దైవప్రవక్త ‘‘ఈ బాధలో సహనం వహిస్తేనీకు స్వర్గం లభిస్తుంది. లేదా నువ్వు కోరితే ఈ వ్యాధి నుంచి నీకు ఉపశమనం కలిగించాలని దేవుణ్ణి కోరుతూ ‘దుఆ’ చేస్తాను అన్నారు.


అందుకు ఆమె బదులిస్తూ ‘‘సరే! అలాగైతే ఓర్పు వహిస్తాను. కానీ మూర్ఛ వచ్చినప్పుడు నా ఒంటిపై ఆచ్ఛాదన తొలగిపోకుండా ఉండాలని మాత్రం దైవాన్ని ప్రార్థించండి’’ అంది. ఆమె కోరిక మేరకు దైవ ప్రవక్త ‘దుఆ’ చేశారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Advertisement
Advertisement