Apr 22 2021 @ 01:03AM

భావోద్వేగాల చిత్రపటం

సినీ గీతరచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ‘చిత్రపటం’. పార్వతీశం, సిరివల్లి, శరణ్య, నరేన్‌, కోట శ్రీనివాసరావు, పోసాని,బాలాచారి, ప్రభాకర్‌ ప్రధాన పాత్రలు ఈ చిత్రంలో పోషించారు.  పుప్పాల శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత ఆర్‌.బి. చౌదరి విడుదల చేశారు. టీజర్‌ బాగుందని ప్రశంసిస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు.


ఈ సందర్భంగా దర్శకుడు బండారు దానయ్యకవి మాట్లాడుతూ ‘ఇంటర్నెట్‌లో మనిషికి కావాల్సినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా భావోద్వేగాలు  మాత్రమే. వాటిని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. ఓ తండ్రికీ, కూతురికీ మధ్య ఆసక్తికరంగా సాగే కథ ఇది. చిత్రంలో ఏడు పాటలను నేనే రాశాను. మే నెల్లో సినిమా విడుదలవుతుంది. దర్శకుడిగా  నాకు ఇది రెండో చిత్రం. మొదటి సినిమా ‘డాటర్‌ ఆఫ్‌ బుచ్చిరెడ్డి’ కూడా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు.