Abn logo
Aug 2 2021 @ 00:40AM

టీ తాగేందుకు వెళుతూ..

ఏలూరు క్రైం, ఆగస్టు 1: టీ తాగడానికి వెళ్తూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనడంతో ఒక జూట్‌మిల్లు కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు చిట్టివలసపాకలకు చెందిన జంజినం నారాయణరావు (46) ఏలూరు జూట్‌మిల్లులో మగ్గం విభాగంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనికి తరచూ టీ తాగే అలవాటు ఉంది. శనివారం రాత్రి టీ తాగడానికి తన ఇంటి నుంచి బయలుదేరి శ్రీనివాసా థియేటర్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా   రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవార్లూ కుటుంబ సభ్యులు అతని కోసం ఎదరు చూశారు. ఆదివారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహం ఉందని తెలియడంతో బంధువులు వెళ్ళి పరిశీలించి నారాయణరావుదిగా నిర్ధారించారు. సమాచారం ఏలూరు రైల్వే పోలీసులకు అందించడంతో రైల్వే ఎస్‌ఐ జీ శ్రీహరి బాబు తన సిబ్బందితో  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

======

కరోనా నుంచి విముక్తి కోసం..

లక్ష గాయత్రి మంత్ర జప యజ్ఞం

కొవ్వూరు, ఆగస్టు 1 : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలగాలని లక్ష గాయత్రి మంత్ర జప యజ్ఞం నిర్వహించారు. ఆదివారం కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని ఆత్మారామాశ్రమ కల్యాణ మండ పంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జప, తర్పణ, హోమ, అర్చన సహితంగా లక్ష గాయత్రి మంత్ర జప యజ్ఞం చేపట్టారు.  బ్రాహ్మణ సేవా సంఘం, శ్రీ గాయత్రి లక్ష్మీ గణపతి జిల్లా పురోహిత సంఘం, శ్రీ సుందరేశ్వర గోష్పాదక్షేత్ర పురోహిత సంఘం, పురుషోత్తమ ధర్మ ప్రచార సభ, గోదావరి నీరాజన సమితి, భారత్‌ వికాస్‌ పరిషత్‌, హైౖదారాబాద్‌కు చెందిన  కేసీ దాస్‌ ట్రస్ట్‌ సభ్యులు  పాల్గొన్నారు.

===========

గుబ్బల మంగమ్మ దర్శనంపై ఆధిపత్య పోరు!

బుట్టాయగూడెం, ఆగస్టు 1: అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకోవాలని  గుబ్బల మంగమ్మ ఆలయానికి  వచ్చిన భక్తులు  పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.  కరోనా ఉధృతి కారణంగా రెండు నెలలు క్రితం అమ్మవారి దర్శనాలను పోలీసులు నిలిపివేశారు. ప్రభుత్వం సడలిం పు లు ఇవ్వడంతో భక్తులు దర్శనానికి వస్తుండగా ప్రతి ఆదివారం పోలీసులు అనుమతులు లేవంటూ నిలుపుదల చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వమే కొన్ని సడలింపులు ఇవ్వడంతో కమిటీ వారు భక్తులకు, వ్యాపారులకు అనుమతులు ఇవ్వాలని పోలీసులను కోరినా అనుమతి ఇవ్వకపోవడంతో గతఆదివారం అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. ఈ వారం దర్శనాలు ఉంటాయి భక్తు లు, వ్యాపారులు రావచ్చని కమిటీ ముందుగానే తెలియపరచినా పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. ఐటీడీఏ పీవో నుంచి దర్శనాలకు అనుమతి పత్రా లు తెస్తేనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తుండటంపై కమిటీ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి భక్తులు రావచ్చని కమిటీ ప్రచా రం చేస్తుండగా అనుమతులు లేవంటూ పోలీసులు కామవరం, పందిరి మా మిడిగూడెం, రామారావుపేట సెంటరులో భక్తుల రాకను అడ్డుకుంటున్నారు.  కొన్ని రోజులుగా కమిటీ, పోలీసుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. సమస్యకు పరిష్కారం ఎప్పుటికో మరి వేచిచూడాలి.

=========

చినజీడిపూడిలో ఆదివాసీ నవోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆదివాసీలు

ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి

బుట్టాయగూడెం, ఆగస్టు 1: ఆదివారం చిన జీడిపూడిలో ఆదివాసీ నవోత్స వాలను ఘనంగా నిర్వహించారు. పరిషత్‌ జిల్లా గౌరవా ధ్యక్షుడు సోదెం మల్లయ్య ఏఎస్‌పీ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షు డు నడపాల సోమరాజు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, ఆదివాసీ చట్టాలను, సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆది వాసీ భాషకు రాజ్యాంగంలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, ఏజెన్సీలో గిరిజ నేతరుల అక్రమ కట్టడాలను  నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.   నాయకులు సరియం రామకృష్ణ, మిడియం సోమరాజు, పూనెం ముత్యాల రావు, మిడియం దుర్గారావు, అక్కమ్మ, లక్ష్మి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.  

జీలుగుమిల్లి: ప్రతి గిరిజనుడు ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలంటే ఆర్ధిక స్వేచ్చ అవసరమని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు అన్నారు. బర్రింకలపాడులో ఆదివాసీ నవోత్సవాల్లో భాగంగా స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. ప్రతీ గిరిజనుడు తమ హక్కులను కాపాడుకుంటూ స్వేచ్ఛగా జీవించాలన్నారు. నేటికి  ఆదివాసీలపై వేదింపులు దాడులు జరుగుతున్నాయన్నారు. బాధితులకు తాము  అండగా ఉంటామన్నారు. మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఉపాధ్యక్షులు పొట్టా కామరాజు, చిర్రి కృష్ణ, రవి, శివ, అర్జున్‌, కొర్స ముత్యాలరావు, పండు భాస్కరావు ఉన్నారు.