Abn logo
Sep 10 2021 @ 00:51AM

కిలో టమోటా రూ.2అయినా వారపు సంతలో అమ్ముడుపోని వైనం... నిరాశతో వెనుదిరిగిన రైతులు

మడకశిర అర్బన, సెప్టెంబరు 9 : స్థానిక వారపు సంతలో గురువారం కిలో టమోటాను రూ. 2లకు విక్రయిద్దామన్నా.. కొనేవారు లేక రైతులు నిరాశకు లోనయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి టెంపో బాడుగలతో వారపు సంతకు అనేక మంది వచ్చారు. 15 కేజీల క్రాట్‌ రూ.25 నుంచి 30లకే విక్రయించినా కొనేవారు కరువయ్యారు. కర్ణాటక ప్రాంతం పెద్దపల్లి గ్రామానికి చెందిన రైతులు మూడు టెంపోలలో ఉదయం 7 గంటలకే టమోటాలు తీసుకువచ్చారు. 10 గంటలైనా అటు హోల్‌సేల్‌, ఇటు రిటైల్‌ వ్యాపారులు ఎవరూ కొనకపోవడంతో మరళా ఆ పంటను నిరాశతో వెనక్కుతీసుకెళ్లారు.  రామచంద్ర అనే రైతు మాట్లాడుతూ.. అసలే డీజిల్‌ ధరలు మండిపోతున్నాయని, టమోటా అమ్మినా  కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు. ఐదెకరాలలో టమోటా సాగు చేశామని, రూ. లక్ష వరకు ఖర్చు చేశామని, ప్రస్తుతం ధర పూర్తిగా పడిపోవడంతో పంట ఎలా అమ్మాలో తెలియడం లేదని వాపోయాడు. టెంపో బాడుగలతో గ్రామాలకు వెళ్లి విక్రయిద్దామన్నా కొనేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా సాగుతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.