Abn logo
Sep 9 2020 @ 01:21AM

స్ఫూర్తిని కోల్పోతున్న సభాపర్వం

Kaakateeya

పార్లమెంట్ సమావేశాలు ప్రభుత్వ జవాబుదారీతనానికి నిదర్శనాలు. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా తాము అనుకున్నది చేసేందుకే పార్లమెంట్ అన్న ధోరణి ప్రభుత్వంలో ఎక్కువగా కనపడుతోంది. సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దును ఈ నేపథ్యంలోంచే అర్థం చేసుకోవాలి.


ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి నిరంతరం చర్చించకపోతే, విశ్లేషించకపోతే పార్లమెంట్ అవసరం, ప్రాముఖ్యత చాలామందికి అర్థం కాదు. పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, పాలక-–ప్రతిపక్షాల మధ్య జరిగే వాగ్యుద్ధాలు, రాజకీయ వాదోపవాదాలు ఒకప్పుడు ఆసక్తికరంగా అనిపించేవి. నాయకుల రాజనీతిజ్ఞత, వారి అనర్గళ వాగ్ధాటి, అనేక అంశాలపై వారి పటిమ ప్రస్ఫుటమయ్యేవి. వాజపేయి, భూపేశ్ గుప్తా, సోమనాథ్ ఛటర్జీ, ఇంద్రజిత్ గుప్తా లాంటి వారు లేచి నిలబడితే వారి ప్రసంగాలు వినేందుకు సభ నిశ్శబ్ద ముద్ర దాల్చేది. జనసంఘ్‌కు కేవలం ఇద్దరు సభ్యులున్నప్పటికీ వాజపేయి చివరి బెంచ్‌లో నిలబడి ప్రసంగిస్తే నెహ్రూ కూడా ఏకాగ్రతతో విని ఆ తర్వాత అభినందించేవారన్న విషయం చరిత్ర పుటల్లో రికార్డు అయింది. పార్లమెంట్‌లో అన్నిటికన్నా సజీవమైనది ప్రశ్నోత్తరాల సమయం. సభ్యుడు వేసిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని చదివి ఇతర సభ్యులు కూడా వేసే అనుబంధ ప్రశ్నలు అనేక సార్లు ప్రశ్నోత్తరాల సమయాన్నే రక్తి కట్టించిన ఉదంతాలు ఉన్నాయి. ఒక్కోసారి ఒకటి, రెండు ప్రశ్నలతోనే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యేది కాని ఆ ప్రశ్నలు, జవాబుల పరంపర ఒక అద్భుత వాక్దృశ్యంలా గోచరించేది.


దేశ రాజకీయాలు, నాయకుల ప్రమాణాలు తగ్గుతున్న కొద్దీ పార్లమెంట్, ప్రశ్నోత్తరాల ప్రమాణాలు కూడా తగ్గిపోవడం సహజం. అంతమాత్రాన పార్లమెంట్‌ను ఉపేక్షించి ప్రభుత్వం పాలన సాగిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేనట్లు లెక్క. పార్లమెంట్‌లో మెజారిటీ పార్టీ సభ్యులతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే అంత మాత్రాన విపక్షాన్ని విస్మరించి తమకు ఇష్టం వచ్చినట్లు పాలన సాగించేందుకు వీలు లేదు. కాని జరుగుతున్నదేమంటే తప్పనిసరి అయితేనే పార్లమెంట్‌ను సమావేశపరచడం, ప్రభుత్వ ఎజెండాను ఆమోదించుకున్న తర్వాత పార్లమెంట్‌కు ప్రాధాన్యత లేదన్నట్లు వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రభుత్వ జవాబుదారీతనానికి నిదర్శనాలు. కాని జవాబులు చెప్పకుండా తాము అనుకున్నది చేసేందుకే పార్లమెంట్ అన్న ధోరణి ప్రభుత్వంలో ఎక్కువగా కనపడుతోంది. సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దును ఈ నేపథ్యంలోంచే అర్థం చేసుకోవాలి.


నిజానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై-–ఆగస్టు నెలల్లో జరగాలి. కాని ఈ సమావేశాలు ప్రభుత్వం ఎప్పుడు జరుపుతుందన్న విషయం ఉభయ సభల అధ్యక్షులకు కూడా సస్పెన్స్‌గా మారింది. సభలు జరగాల్సిన సమయం సమీపిస్తున్న కొద్దీ వారు అనేక సార్లు చర్చలు జరిపారు. అధికారులను పిలిచి ఏఏ జాగ్రత్తలతో సభలు నిర్వహించాలో సమీక్షించారు. సెంట్రల్ హాలులో నిర్వహించాలా, విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించాలా అన్న చర్చలు కూడా సాగించారు. తామేమి చర్చలు సాగించినా ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరపాలో నిర్ణయించకపోతే వారేమి చేయగలరు? ప్రజాస్వామ్యంలో ఎంత రాజ్యాంగాధినేతలైనా వారి పాత్రను ప్రభుత్వాలు నిర్ణయించాల్సిందే. అంతవరకు వారేమి చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎట్టకేలకు ప్రభుత్వం సెప్టెంబర్ 14 నుంచి నెలాఖరు వరకు 15 రోజులు ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ సభ్యుల సమయం లేకుండా పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించింది.


ఇప్పుడున్న జాగ్రత్తలతోనే ఈ సమావేశాలను కొంత ముందుగా నిర్వహించినా, నెలరోజుల బదులు మూడు వారాలు సమావేశాలు నిర్వహించినా జరిగే నష్టం ఏమీ ఉండేది కాదు. కాని మోదీ ప్రభుత్వం తమ ఎజెండాకు ఎంత కాలం పడుతుందో అంచనా వేసి పార్లమెంట్ తేదీలను పకడ్బందీగా నిర్ణయించిన విషయం స్పష్టమవుతుంది. అంతేకాక ఆరునెలల వ్యవధిలో సమావేశాలను నిర్వహించడం తప్పనిసరి. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రభుత్వం పెద్దగా చర్చ లేకుండా కొన్ని గంటల వ్యవధిలో కీలక బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించడంతోనే ఈ విషయం స్పష్టమవుతోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నప్పటికీ ప్రభుత్వం గత మార్చిలో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసేందుకు ఏ మాత్రం ఆతురత ప్రకటించలేదు. తమ ఎజెండా పూర్తయిన తర్వాతే సమావేశాలను వాయిదా వేసింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వ కూల్చివేత ఆపరేషన్ పూర్తి చేసేంతవరకూ పార్లమెంట్ సమావేశాలను నడిపింది. అదే మోదీ ప్రభుత్వం వర్షాకాల సమావేశాల విషయంలో సాధ్యమైనంత తాత్సారం చేసింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఎజెండా నెరవేర్చుకోవడం కోసం తూతూమంత్రంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.


మార్చి 23 నుంచి నేటివరకూ దేశంలో ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి. కరోనాకు ముందున్న ఆర్థిక సంక్షోభం కరోనా మూలంగా మరింత తీవ్రతరమైంది. లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అనేక పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కోట్లాది మంది జీతాలు తగ్గిపోయాయి. మార్కెట్‌లో ఒక రకమైన ప్రేతకళ ప్రవేశించింది. కోట్లాది వలస కూలీలు దుర్భర కష్టాలకు గురయ్యారు. వందల మైళ్లు నడిచే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కరోనా విషయంలో మోదీ ప్రభుత్వ వైఫల్యం వలసకూలీల విషయంలో ప్రారంభమయితే ఆర్థిక సంక్షోభంతో తారాస్థాయికి చేరుకుంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం కంటితుడుపు ప్యాకేజీ మాత్రమేనని, అది సామాన్యుడికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏ మాత్రం సహాయపడలేదని అర్థమైంది. అసాధారణ స్థితిలో జీడీపి-23.9 శాతానికి క్షీణించింది.


రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీని కూడా చెల్లించలేక అప్పులు చేసుకొమ్మని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. నిజానికి జీఎస్టీ అమలు చేసిన తీరు దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని దెబ్బతీసి, రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టింది. జీఎస్టీ అమలు కోసం రాష్ట్రాలు, పన్నుల వసూళ్ళకు సంబంధించి తమ అధికారాలను వదులుకుంటే జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చిన నష్టాలను భర్తీ చేస్తామన్న హామీని కేంద్రం మరచిపోయింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారి విషయంలో ఏమీ చేయలేని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రజల పొట్ట గొడుతోంది. ఆదాయాలు తగ్గిపోయి ఖర్చులు పెరిగిన మధ్యతరగతి ప్రజలు ఎవరిని తిట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. విచిత్రమేమంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేవుడి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దేవుడే ఈ పరిస్థితికి కారణమైతే ప్రభుత్వం ఎందుకు? ఆర్థిక మంత్రి ఎందుకు? కరోనా సమయంలో అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కేందుకు దేవుడు ఎందుకు సహాయపడడం లేదు?


రోజుకు 70 వేల మందికి పైగా కరోనా వాతపడుతుండగా అరికట్టలేని వైఫల్యానికి తోడు ఆర్థిక సంక్షోభాన్నుంచి దేశాన్ని గట్టెక్కించలేని వైఫల్యం చేరింది. ఈ రెండిటితోపాటు చైనా చేస్తున్న దురాక్రమణ ప్రభుత్వాన్ని మరింత నిస్సహాయ స్థితిలో నెట్టివేసింది. చైనా సైనికులు మన భూభాగంలో ప్రవేశించిన విషయం స్పష్టంగా తెలుస్తుండగా, అసలు వారు అంగుళం కూడా ఆక్రమించలేదని అఖిలపక్ష సమావేశంలో మోదీ ప్రకటించడం దిగ్భ్రమ కలిగించింది. మూడునెలల తర్వాత కూడా మన సరిహద్దుల్లో పరిస్థితి మెరుగుపడలేదు. బాహాబాహీ యుద్ధంలో సైనికులు మరణించిన చోట ఇవాళ ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గాంధీనగర్, ఊహాన్, మహాబలిపురంలలో చైనా దేశాధినేతతో మనం జరిపిన చర్చలు కానీ, యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత సరిహద్దుల్లోనూ, రష్యా వంటి ఇతర దేశాలలోనూ జరుపుతున్న చర్చలు కానీ ఏమయ్యాయి? ఇవన్నీ జరుగుతుండగానే గరీబ్ కల్యాణ్ పేరిట దేశంలో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు పెద్ద పీట వేస్తూ అమీర్ కల్యాణ్‌ను అమలు చేసే ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణలకు ఆత్మనిర్భర్ పేరుతో మేలిముసుగు వేశారు.


వీటన్నిటి గురించీ ప్రభుత్వం నేరుగా ప్రజలకు జవాబులు చెప్పలేదు. ప్రధానమంత్రి తన ‘మన్ కీ బాత్’లో బొమ్మల గురించో, మరో ప్రాధాన్యత లేని అంశం గురించో మాట్లాడుతున్నారు. ఉన్నట్లుండి నెమళ్లకు ఆహారం తినిపించే దృశ్యాలు విడుదల చేస్తున్నారు. ప్రజలకు కావల్సిన జవాబులు కావివి. అందుకే పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నా ప్రశ్నలు వేస్తాయని, వాటి ద్వారా తమకు జవాబులు వస్తాయని వారు ఆశిస్తున్నారు. ఎన్ని రోజుల్లో తమ సమస్యలు తీరిపోతాయో ప్రభుత్వం చెబుతుందని, నిజంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందో లేదో స్పష్టత కలుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చే పరిస్థితులు కనపడడం లేదు. 15 రోజుల సమావేశంలో పార్లమెంట్ ఆమోదించేందుకు ఇప్పటికే 11 ఆర్డినెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నాలుగు ఆర్డినెన్స్‌లు వ్యవసాయంలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించేవే. వీటిని అనేక రాష్ట్రాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్‌లుకాక అనేక బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 15 రోజుల్లో వీటన్నింటినీ ఆమోదించేందుకే సమయం సరిపోదు. ఇక ఆర్థిక సంక్షోభం, చైనా దురాక్రమణ, కరోనాలో వైఫల్యం, జీఎస్టీ విషయంలో రాష్ట్రాలకు జరిగిన అన్యాయం మొదలైన అనేక అంశాల గురించి ప్రభుత్వాన్ని నిలదీసి జవాబులు రాబట్టుకునే సమయం ఎక్కడుంటుంది?


దేశంలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చి సరైన పాలన జరిగేలా చూసేందుకు, ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైంది. యూట్యూబ్‌లో ప్రధాని ప్రసంగాన్ని లక్షలాది మంది అయిష్టపడడం ఒక సంకేతమే కావచ్చు కాని బలమైన ప్రతిపక్షం లేకపోతే మోదీనే తిరిగి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో కేసిఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సోరెన్ వంటి ప్రాంతీయ పార్టీల అధినేతలు జాతీయ ప్రత్యామ్నాయం దిశన ఆలోచించడం సరైన పరిణామమే. నిజానికి గత ఎన్నికలకు ముందే కేసిఆర్ ఈ పరిణామాల గురించి దూరదృష్టితో ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఆలోచనలకు మరింత బలం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయం అంటూ లేకపోతే పార్లమెంట్‌తో పాటు అన్ని వ్యవస్థలనూ కుప్పకూల్చినా, రాష్ట్రాలకు భిక్షాపాత్ర అప్పగించినా అడిగేవాడుండడు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement