Abn logo
May 4 2021 @ 03:08AM

లాక్‌డౌన్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

ఎన్‌ 440 కే వైరస్‌ అత్యంత ప్రమాదకరం: చంద్రబాబు 


అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో కరోనాలో కొత్త రూపమైన ఎన్‌ 440 కె వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇతర కరోనా వైరస్‌ రకాలతో పోలి స్తే 10 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు తొలిగా కర్నూలులో కనుగొన్నారు. ఇప్పటికే ఇది రాష్ట్రంలో 30 శాతం వ్యాపించింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన తమ పార్టీ నేతలతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తదితర అంశాలపై ఆన్‌లైన్‌లో చర్చించారు. రాష్ట్రంలో పడకల కొరత ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పేర్కొనడాన్ని సమావేశం పరిగణనలోకి తీసుకొంది. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ కొరతతో ఇది విపత్తుగా మారుతోందని, ఇది మరింత తీవ్రస్థాయికి చేరకుండా అరికట్టాలంటే ఏపీలో లాక్‌డౌన్‌కు తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సమావేశం డిమాం డ్‌ చేసింది. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి సమయం వృధా చేయకుండా కరోనాపై దృష్టి పెట్టాలని సమావేశం డిమాండ్‌ చేసింది. 


వ్యాక్సిన్‌ కొనుగోలుకు సిద్ధం ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి కంపెనీలకు ఆర్డర్‌

వ్యాక్సిన్‌ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో 18-45 ఏళ్ల వయస్సు వారి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 13 లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు ముందడుగు వేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు సీరం ఇనిస్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు సోమవారం ఆర్డర్లు పంపించారు. కేంద్రం ఏపీకి 9 లక్షల కొవీషీల్డ్‌, 3.90 లక్షల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను కేటాయించింది. ఈ మొత్తం పంపాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ఈ కంపెనీలకు ఆర్డర్‌ పెట్టారు. కంపెనీలు నిర్ణయించిన ధరతోపాటు జీఎస్టీతో కలిపి బిల్లులు చెల్లించేందుకు ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు సిద్ధమయ్యారు.


దివ్యాంగులకు, గర్భిణులకు వర్క్‌ ఫ్రం హోం

రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులైన ప్రభుత్వ ఉద్యోగులకు, గర్భిణులకు కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు అవకాశం కల్పించింది. కరోనా విజృంభణ పరిస్థితుల్లో దివ్యాంగులైన ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని విజువల్లీ చాలెంజెడ్‌ ఎంప్లాయీస్‌ అసోషియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిస్తూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ మెమో జారీ చేశారు.


లాక్‌డౌన్‌ కాదు.. కర్ఫ్యూనే!:  సింఘాల్‌

రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నామని.. అయితే ఇది లాక్‌డౌన్‌ కాదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి రెండు రకాల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ‘ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవు. వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలలూ ఉండవు. ఎక్కడా ఐదుగురి కంటే ఎక్కువగా ఉండకుండా 144 సెక్షన్‌ అమలు చేస్తాం. నిత్యావసరాల కొనుగోలుకు భౌతిక దూరం పాటించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూ ఉంటుంది. మెడికల్‌సహా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. మీడియా, ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం ఉండబోదు. పాస్‌లు, ప్రయాణికుల రాకపోకలపై విధి విధానాలను మంగళవారం తెలియజేస్తాం’ అని వివరించారు.

Advertisement
Advertisement
Advertisement