Abn logo
Sep 28 2020 @ 03:39AM

నెలంటే 90 రోజులా!?

Kaakateeya

అంతకంటే ఇంకా ఎక్కువేనా..

నెలలోనే కాపు నేస్తం లబ్ధి అన్న సీఎం 

3 నెలలుగా మహిళల ఎదురుచూపులు

ప్రభుత్వం తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం 

గతంలో అమలైన పథకాలకు గుడ్‌బై

ఉన్న ఒక్కదాన్నీ పట్టించుకోవట్లేదని ఫైర్‌


‘సరిగ్గా నెల రోజుల్లో కాపునేస్తం లబ్ధి నగదు బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. ఇప్పటికి 3నెలలు దాటింది. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా వేయలేదు. మాట తప్పం, మడమ తిప్పమంటే ఇదేనా?’ అని కాపు మహిళలు ప్రశ్నిస్తున్నారు. అసలు నెల అంటే 30 రోజులా... 90 రోజులా?... అంతకంటే ఇంకా ఎక్కువేనా?... అనే సందేహాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. నెలలో ఇస్తామన్న సాయం మూడు నెలలు దాటినా ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

కాపునేస్తం కింద ఇచ్చే సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 90,679 మంది కాపు మహిళలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కాపులకు అమలుచేసిన పథకాలన్నిటికీ మంగళం పాడిన వైసీపీ ప్రభుత్వం కాపునేస్తం పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 45-60 ఏళ్ల కాపు మహిళలకు ఏటా రూ.15వేలు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఈ ఏడాది జూన్‌ 24న మొదటి విడత నగదు ఖాతాల్లో వేశారు. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారంతా మళ్లీ దరఖాస్తు 


చేసుకోవచ్చని, వారికి సరిగ్గా వచ్చే నెల ఇదే రోజున అంటే జూలై 24న నగదు ఖాతాల్లో వేస్తామని అదేరోజు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,02,226 మంది మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 11,547 మందిని అనర్హులుగా పేర్కొంటూ వారి దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా 90,679 మందిని అర్హులుగా ప్రకటించి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. సీఎం హామీ ఇచ్చినట్లుగా జూలై 24న కాపునేస్తం నగదు అందుతుందని అర్హులైన మహిళలంతా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. తమకేం తెలియదంటూ స్థానిక అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మూడోవారంలో కాపునేస్తం నగదును సీఎం చేతుల మీదుగా విడుదల చేస్తారని కాపు కార్పొరేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు సెప్టెంబరు నాలుగో వారం వచ్చినా ఇంతవరకూ దానిపై ఎలాంటి కదలికా లేదు.


సరిగ్గా నెల రోజులు అని సీఎం స్పష్టంగా ప్రకటించినా 3నెలలు దాటినా ఇంతవరకూ బ్యాంకు ఖాతాల్లో నగదు పడకపోవడంపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓవైపు కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీరంతా ప్రభుత్వం నగదు వేస్తే ఏదొక అవసరానికి అక్కరకు వస్తాయని ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో కాపునేస్తం లబ్ధికి చాలామంది దూరమవడం వల్లే రెండో విడతలోనూ భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమైంది. ఆ సమయంలోనే మీసేవ కేంద్రాల నిర్వాహకులు బంద్‌ పాటించారు. పత్రాలు సమయానికి చేతికి రాకపోవడంతో చాలామంది రెండో విడతలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌ కింద స్వయంఉపాధి, నైపుణ్యాభివృద్ధి లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగా వాటన్నిటికీ వైసీపీ ప్రభుత్వం మంగళం పాడింది. మొత్తం తీసేసి కేవలం ఒక్క కాపునేస్తం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో కాపులకు ప్రభుత్వం నుంచి దీనిద్వారా తప్ప మరే ఇతర రూపాల్లోనూ మేలు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement
Advertisement