Abn logo
Jul 12 2020 @ 06:09AM

కోరలుచాస్తున్న కరోనా

కొత్తగా 81 కేసులు.. మొత్తం 688

జిల్లా కేంద్రంలో మరొకరి మృతి 


(రింగురోడ్డు): జిల్లాను కరోనా వణికిస్తోంది. పల్లె, పట్టణాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతాపం చూపుతోంది. కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఒకేసారి అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మృతులు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తాజాగా శనివారం 81 కేసులు నమోదయ్యాయి. మరొకరు మృతిచెందారు.


ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. జూన్‌ నెలాఖరు నుంచి జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గణ నీయంగా పెరుగుతూ  వస్తోంది. రోజురోజుకూ రెట్టింపు కేసులు వస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు తీసుకుంటూనే కలవర పడుతున్నారు. జిల్లాలో ఈ నెల 11 నాటికి 688 కేసులు నమోదయ్యాయి. బాధితులను ఎప్పటికప్పుడు కొవిడ్‌ మిమ్స్‌ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని బయటపడుతున్న వారు కూడా ఎక్కువగా ఉండడం విశేషం. ఇప్పటివరకూ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 248 మంది క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు హోంక్వారంటైన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ దైనందిన విధుల్లో నిమగ్నమవుతున్నారు. 


జిల్లా వ్యాప్తంగా శనివారం 81 మందిలో కరోనా నిర్ధారణ అయింది. వీరిని నెల్లిమర్లలోని కొవిడ్‌-19 ఆసుపత్రికి చేర్చారు. తాజా కేసుల్లో విజయనగరంలో 51(వసంతవిహార్‌-1, పూల్‌బాగ్‌-2, వైఎస్సార్‌ కాలనీ-2, జగదాంబనగర్‌-1, శాంతినగర్‌-1, నాగవంశపువీధి -3, ఉడాకాలనీ-2, ఆగురువీధి-1, కొత్తధర్మపురి- 4, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారు- 3, గవరవీధి-1, సాకేటివీధి-1, జూట్‌మిల్లు ప్రాంతం -1, శ్రీరామ్‌నగర్‌కాలనీ-1, ధర్మపురి-2, అంబటిసత్తర్వు-1, కణపాక -4, ప్రదీప్‌నగర్‌-1, దాసన్న పేట-1, బొండపల్లి-3, కొత్తఅగ్రహారం-2, వీటి అగ్రహారం-6, ఎస్‌బీటీ మార్కెట్‌-1, కొండ కరకాం-1, కంటుభుక్తవారివీధి-1, జొన్నవలస-1, ప్రశాంతనగర్‌-1, గాజులరేగ-1, రాజీవ్‌ నగర్‌ కాలనీ-1, జొన్నాడ-1), ఎస్‌.కోట మండలంలో 2, సాలూరు-1, మక్కువ-1, కొత్తవలస-1, గంట్యాడ-1, మక్కువ-1, సాలూరు-2, పార్వతీపురం-8, సీతానగరం-1, కొమరాడ-1, బొబ్బిలి-5, మక్కువ-1, పూసపాటిరేగ-1, వేపాడ-2, బొండపల్లి- 3, మెరకముడిదాం-1, నెల్లిమర్ల మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి మరణించిన మహిళ ఈ నెల 10న ఉదయం జిల్లా కేంద్రా సుపత్రిలో మధుమేహం, రక్తపోటు సమస్యలతో చేరింది. చికిత్స పొందుతూ రాత్రి గుండెపోటుతో మరణించింది. చికిత్స సమయంలో రక్తపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టరు జె.రవికుమార్‌ శనివారం తెలిపారు.


మిమ్స్‌ నుంచి 35 మంది డిశ్చార్జ్‌

జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి మిమ్స్‌లో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకుని శనివారం 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వారికి కొవిడ్‌ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్య హరికిషన్‌, మిమ్స్‌  మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురాం పండ్లు, ప్రభుత్వం మంజూరుచేసిన రూ.2000 వంతున ఆర్థిక సాయం అందజేసి మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు.  ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. 

Advertisement
Advertisement
Advertisement