Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైత్‌ను వీడుతున్న భారతీయులు.. కేవలం 3 నెలల్లోనే..

ఇంటర్నెట్ డెస్క్: బతుకుతెరువు కోసం కువైత్ వెళ్లిన అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చేస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో మొత్తం 67,800 మంది విదేశీ కార్మికులు కువైత్‌ను వీడితే అందులో దాదాపు 21 వేల మంది భారతీయులే. ఉద్యోగాల్లో కువైత్ వాసులకే పెద్దపీట వేయాలన్న ప్రభుత్వావిధానానికి కరోనా సంక్షోభం తోడవడంతో అనేక కంపెనీలు తమ వర్కర్లకు లేఆఫ్ ఇచ్చేశాయి. ఫలితంగా.. సంపాదన కోల్పోయిన అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.

అక్కడి లేబర్ మార్కెట్ పరిస్థితులపై జరిగిన ఓ సర్వేలో..గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకూ 2 లక్షల మంది వర్కర్లు తమ స్వదేశాలకు తరలిపోయినట్టు వెల్లడైంది. దీనికి తోడు..అక్కడి ప్రభుత్వ మానవవనరుల నిర్వహణ శాఖ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా విదేశీ వర్కర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. కనీసం యూనివర్శిటీ డిగ్రీ లేదా డిప్లోమా లేని 60 ఏళ్లు పైబడిన వారి వీసాలు రెన్యువల్ చేయవద్దంటూ మానవవనరుల శాఖ జారీ చేసిన ఆదేశాల కారణంగా 42 వేల మంది విదేశీ వర్కర్లు కువైత్ వీడాల్సి వచ్చింది. ఫలితంగా..అక్కడి హోటల్, రెస్టారెంట్లలో వర్కర్ల కొరత ఏర్పడింది. 

‘‘నిపుణులైన వర్కర్లు లేక రెస్టారెంట్ నిర్వహణలో ఇబ్బందులు వస్తున్నాయి. విదేశీ వర్కర్ల నియామకాలపై ఆంక్షల కారణంగా..చేయి తిరిగిన వంటవాళ్లు, బేకర్స్, స్వీట్లు చేసే వాళ్లకు కొరత ఏర్పడింది’’ అని కువైత్ రెస్టారెంట్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు ఫహాద్ అల్ అర్బాష్ పేర్కొన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వర్కర్లలో నైపుణ్యాల కొరత ఉందని, వారికి శిక్షణ ఇవ్వడం కూడా అంత సులువు కాదని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కొరత కారణంగా వర్కర్లకు డిమాండ్ పెరిగి వారి శాలరీలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. రెస్టారెంట్లో క్లినింగ్ సిబ్బంది శాలరీ కూడా రెట్టింపైంది. ఇక స్వీట్ల తయారీ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారు కూడా మునుపటి శాలరీ కంటే రెండురెట్లకుపైగా అధిక జీతం తీసుకుంటుంన్నారట. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement