Abn logo
Sep 27 2020 @ 03:38AM

60% మంది నడిచే బడికి!

Kaakateeya

 66% మంది బాలికలకు కాలినడకే శరణ్యం..

గ్రామీణ విద్యార్థుల్లో 11 %మంది సైకిళ్లపై.. 

తెలంగాణలో 54.5%.. ఏపీలో 44 శాతం

ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ అధ్వానం

జాతీయ నమూనా సర్వేలో వెల్లడి


స్పెషల్‌ డెస్క్‌: దేశంలో 60 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు నడిచే వెళ్తున్నారు! అందులోనూ బాలుర కంటే బాలికలే ఎక్కువగా నడిచి వెళ్లి చదువుకుంటున్నారు! గ్రామీణ ప్రాంతాల్లో బాలికలే అధిక సంఖ్యలో కాలినడకన విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు! దేశంలోని మొత్తం విద్యార్థుల్లో 10.2 శాతం మందే బస్సుల్లో వెళ్లి చదువుకుంటున్నారు! ఈ విషయాలను జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. కరోనా కారణంగా మార్చిలో మూతపడిన విద్యా సంస్థలు చాలా రాష్ట్రాల్లో సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులు విద్యాసంస్థలకు ఎలా చేరుకుంటున్నారనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం విద్యార్థుల్లో 62 శాతం మంది బాలికలు నడుచుకుంటూ పాఠశాలలకు వెళుతుండగా 57.9 శాతం మంది బాలురు కాలినడకన వెళ్తున్నారని 2017 నుంచి 2018 జూన్‌ వరకు నిర్వహించిన సర్వేలో తేలింది. 12.4 శాతం మంది బస్సులు, రైళ్ల వంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని విద్యాసంస్థలను చేరుకుంటున్నారు. 11.3 శాతం మంది విద్యార్థులు సైకిళ్లపై వెళ్తున్నారని సర్వే తెలిపింది. 6 శాతం మంది విద్యార్థులు మాత్రమే సొంత వాహనాలు లేదా ఇతర మార్గాల్లో విద్యాసంస్థలను చేరుకుంటున్నారని వెల్లడించింది. 


బాలికలకు ఎంత కష్టం..?

పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు ఎక్కువ శాతం మంది కాలినడకన విద్యా సంస్థలకు చేరుకుంటున్నారు. 66.5 శాతం మంది గ్రామీణ బాలికలు, 61.4% మంది బాలురు కాలినడకన వెళుతున్నారు. పట్టణాల్లో ఉంటున్న బాలికల్లో 50 శాతం మందే నడుచుకుంటూ పాఠశాలలకు వెళుతున్నారు. 14% మంది పట్టణ బాలికలు స్కూలు బస్సుల్లో వెళుతుండగా, 15.7 శాతం మంది ప్రభుత్వ రవాణా మీద ఆధారపడుతున్నారు. గ్రామాల్లో 3.7శాతం మంది బాలికలు సొంత వాహనాలు లేదా ఇతర వాహనాల ద్వారా స్కూళ్లకు వెళుతున్నారని.. పట్టణాల్లో 12 శాతం మంది బాలబాలికలు సొంత వాహనాలు లేదా ఇతర మార్గాల ద్వారా విద్యాసంస్థలకు వెళ్తున్నారని సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 11.1 శాతం మంది బాలికలు సైకిళ్ల మీద పాఠశాలలకు వెళుతున్నారు. 48 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకుని ప్రయాణిస్తున్నారని, మిగిలిన విద్యార్థులు సొంత ఖర్చులతోనే వెళ్తున్నారని  సర్వే వివరించింది. 


తెలంగాణలో అధికం

ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణలో అధిక శాతం మంది విద్యార్థులు కాలినడకన విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో 58.8 శాతం మంది గ్రామీణ బాలికలకు కాలినడకే శరణ్యమైంది. బాలురు, బాలికలు కలిపి మొత్తం 54.5 శాతం మంది తెలంగాణ విద్యార్థులు కాలినడకన, 13శాతం మంది స్కూల్‌ బస్సుల్లో వెళ్తుండగా 22.8శాతం మంది ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 49% మంది గ్రామీణ బాలికలు కాలినడకన వెళ్తున్నారు. బాలురు, బాలికలు కలిపి 44 శాతం మంది కాలినడకన స్కూళ్లకు వెళుతండగా 23.6 శాతం మంది ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకుంటున్నారు. ఏపీలో 9శాతం మంది, తెలంగాణలో 4.5శాతం మంది సైకిల్‌పై విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో అత్యధికంగా 57.4శాతం మంది నడిచి వెళుతున్నారని సర్వే తెలిపింది. కేరళలో 24 శాతం మందే కాలినడకన విద్యాసంస్థలకు వెళ్తున్నారు. 


ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి అధ్వానం

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా ఉందని సర్వే తెలిపింది. పట్టణాలు, గ్రామాల్లో కలిపి జార్ఖండ్‌లో 70.3, బిహార్‌లో 70, ఉత్తరప్రదేశ్‌లో 64, మధ్యప్రదేశ్‌లో 63, ఒడిసాలో 59 శాతం మంది విద్యార్థులు కాలినడకన విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు. అత్యధికంగా గుజరాత్‌ విద్యార్థుల్లో 16 శాతం మంది సైకిల్‌పై విద్యాసంస్థలను చేరుకుంటున్నారు. పంజాబ్‌ మినహా తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అధిక శాతం ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు కాలినడకనే విద్యాసంస్థలను చేరుకుంటున్నారని సర్వే తెలిపింది.  కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా ప్రారంభం కాని తరుణంలో విద్యార్థులు పాఠశాలలకు ఎలా వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.   

Advertisement
Advertisement
Advertisement