Abn logo
May 21 2020 @ 02:37AM

ఒక్కరోజే 5,611 కేసులు

  • 210 మరణాలు.. దేశంలో 1,06,750కి చేరిన కేసుల సంఖ్య
  • మహారాష్ట్రలో గంటకు 3 మరణాలు.. 89 కేసులు
  • కరోనాతో ఒక్కరోజే 65 మంది మృతి
  • ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉద్యోగికి పాజిటివ్‌
  • కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ కార్యాలయమూ అక్కడే


న్యూఢిల్లీ, మే 20: కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. వైరస్‌ కారణంగా ఈ రాష్ట్రంలో గంటకు మూడు మరణాలు, 89 కొత్త పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదవుతున్నాయి.  బుధవారం ఒక్కరోజే మరో 65 మంది చనిపోయారు. కొత్తగా మరో 2,250 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మరణాల సంఖ్య 1390కి చేరగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 39,297కు చేరింది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి రోజూ 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం గమనార్హం. బుధవారం నమోదైన 65 మరణాల్లో ఒక్క ముంబయి నుంచే 41 ఉన్నాయి. ఇక దేశం మొత్తమ్మీద నమోదైన పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు మహారాష్ట్రలోనే ఉండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటికి 1,06,750కి చేరింది. గడచిన 24 గంటల్లో 5,092 కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 210 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,355కు చేరింది. ఇప్పటివరకు 44,757 మంది కోలుకున్నట్లు, ఇంకా 62,478 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రికవరీ శాతం 39.62గా ఉందని తెలిపింది. ఇక దేశవ్యాప్త మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాతి స్థానంలో గుజరాత్‌ (749) ఉందని తెలిపింది. ఇక బుధవారం మహారాష్ట్ర తరువాత అత్యధికంగా తమిళనాడులో 743 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 534 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. వీటితో కలిపి ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 11,088కి చేరింది. మరణాల సంఖ్య 176కి చేరింది. కాగా, మృతుల్లో 26 శాతం మంది 50-59 ఏళ్ల వయసు వారేనని అధికారులు తెలిపారు. 


డీజీహెచ్‌ఎ్‌స ఉద్యోగికి పాజిటివ్‌..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డీజీహెచ్‌ఎ్‌సలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన అధికారులు.. సహచర సిబ్బందిని, ఆయనను కలిసిన వారందరినీ క్వారంటైన్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంగణంలోని మూడో అంతస్థులో ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. మరోవైపు బెంగళూరుకు చెందిన ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె క్లినిక్‌లో పనిచేసే ఆరుగురు సిబ్బందిని అధికారులు 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. గైనకాలజిస్టు అయిన ఆ డాక్టర్‌ వద్దకు వెళ్లిన పేషంట్ల వివరాలు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐదు రోజుల క్రితం 15 మంది ఖైదీలకు పాజిటివ్‌గా తేలిన ఢిల్లీలోని రోహిణి జైలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌కూ కరోనా సోకింది. దీంతో అధికారి కుటుంబసభ్యులతోపాటు జైలు సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. 


బోనీకపూర్‌ ఇంట్లో పనిమనిషికి పాజిటివ్‌

ప్రముఖ సినీ నిర్మాత బోనీకపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒకరికి కరోనా వైరస్‌ సోకింది. ముంబయిలోని సబర్బన్‌ అంధేరిలోని తన నివాసం పనిచేసే చరణ్‌సాహు (23) శనివారం అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలకు పంపించామని, టెస్టుల్లో అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, బోనీకపూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో అధికారులకు సమాచారమిచ్చామన్నారు. తమ కుటుంబ సభ్యులు, ఇతర పనివారికి మాత్రం లక్షణాలు లేవని, అయినా.. సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లామని పేర్కొన్నారు. 

కరోనాను జయించిన వృద్ధురాలు

పుణెలో 65 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. డయాబెటిక్‌ అయిన ఆమెకు ఆర్థరైటిస్‌ సమస్య కూడా ఉంది. దీంతో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా టెస్టు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఆందోళనకర స్థితిలో ఉన్న ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. 12 రోజుల చికిత్స తరువాత కోలుకోవడంతో జనరల్‌ వార్డుకు తరలించారు. ఆ తరువాత నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా చేతికర్ర సాయంతో బయటికివచ్చిన ఆమె.. డ్యాన్స్‌ చేస్తూ తన ఆనందాన్ని ఆస్పత్రి సిబ్బందితో పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ  వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి

పశ్చిమబెంగాల్‌లో 500 మంది కానిస్టేబుళ్లు కలిసి డీసీపీపై దాడి చేశారు. కోల్‌కతాలోని ఓ కట్టడి ప్రాంతంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు.. తమతోపాటు బ్యారక్‌లో ఉండే ఓ ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ అని తేలినా బ్యారక్‌ను శానిటైజేషన్‌ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.  దీనిపై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రాత్రి డీసీపీ ఎన్‌ఎ్‌స పాల్‌ ఇంటికి వెళ్లారు. ఇంటిబయటకు వచ్చిన ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో కానిస్టేబుళ్లలో కొందరు డీసీపీపై దాడి చేశారు. పరిస్థితిని గమనించిన డీసీపీ పరుగెత్తగా కానిస్టేబుళ్లు వెంటాడారు. ఈ క్రమంలో ఇతర కానిస్టేబుళ్లు ఆయనను కాపాడి ఆస్పత్రికి తరలించారు. సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. 


Advertisement
Advertisement
Advertisement