Abn logo
Jun 19 2021 @ 11:21AM

ఊపిరాడ‌ని ట్రక్కులో ప్ర‌యాణించిన 33 మంది అక్రమ వలసదారులు.. చివ‌రికి..

టెక్సాస్‌: అమెరికాలో అక్ర‌మంగా ప్ర‌వేశించేందుకు 33 మంది వ‌ల‌స‌దారులు ఊపిరాడ‌ని ట్రక్కులో ప్ర‌యాణించి ప్రాణాలమీద‌కు తెచ్చుకున్న ఘ‌ట‌న టెక్సాస్ బార్డ‌ర్ వ‌ద్ద వెలుగుచూసింది. ఈ నెల 10న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కొన్నాళ్లుగా అక్ర‌మ మాన‌వ ర‌వాణా జ‌రుగుతుంద‌నే స‌మాచారం మేర‌కు యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఈ నెల 10న రాత్రి 10 గంట‌లకు(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) బిగ్ బెండ్ సెక్టార్ వ‌ద్ద‌ అటుగా వ‌చ్చిన ఓ ట్ర‌క్కును ఆపి సోదా చేశారు. దీంతో ఆ ట్ర‌క్కులో ఏకంగా 33 మంది అక్రమ వలసదారులు బ‌య‌ట‌ప‌డ్డారు. అధిక వేడి, స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల వారు ఆ స‌మ‌యంలో మరణానికి దగ్గరగా ఉన్నార‌ని యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్ల‌డించారు. వీరిలో 12 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని వారిని వెంట‌నే చికిత్స కోసం స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. డీహైడ్రేష‌న్ వల్ల 12 మంది ప‌రిస్థితి విష‌మంగా మారింద‌న్నారు. ఒక విధంగా చెప్పాలంటే తాము చేసిన త‌నిఖీలే వారి ప్రాణాలు కాపాడ‌య‌ని బిగ్ బెండ్ సెక్టార్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ సీన్ ఎల్‌. మెగాఫిన్ పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఈ కేసును ప్రాసిక్యూషన్ కోసం అంగీకరించిందన్నారు.