Abn logo
Sep 27 2020 @ 03:34AM

గంటకు 30 సిజేరియన్లు!

Kaakateeya

కడుపు కోతల్లో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ.. గతేడాది ఆరో స్థానంలో రాష్ట్రం

కేసీఆర్‌ కిట్‌లతోనూ ఫలితం లేదు

వివరాలు వెల్లడించిన కేంద్రం


హైదరాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రతి గంటకు 30 మంది సిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారానే జన్మిస్తున్నారు. సీ సెక్షన్‌లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు 740 సిజేరియన్‌ ఆపరేషన్లు  జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు జరిగిన శస్త్రచికిత్సల గణాంకాలను కేంద్రం తాజాగా  వెల్లడించింది. మూడు నెలల్లో రాష్ట్రంలో 66,661 సిజేరియన్లు జరగ్గా, ప్రభుత్వ దవాఖానల్లో 30,560, ప్రైవేటు ఆస్పత్రుల్లో 36,101 జరిగాయి. దేశంలోనే అత్యధికంగా  మహారాష్ట్రలో 85,323, తమిళనాడులో 78,982 సీసెక్షన్స్‌ ఆపరేషన్స్‌ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. సిజేరియన్‌ ఆపరేషన్లు తగ్గించే లక్ష్యంతో తెలంగాణలో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి, నాలుగు విడతల్లో రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తున్నా కడుపు కోతలు ఏ మాత్రం ఆగడం లేదని తాజా గణంకాలతో నిరూపితమైంది.


గత మూడేళ్లుగా మూడేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 1.25 నుంచి 1.30 లక్షల సిజేరియన్‌ ఆపరేషన్లు జరిగాయి. ప్రైవేటులో అది 1.40 నుంచి 1.60 లక్షల మధ్య ఉంటోంది. గత ఏడాది సీ-సెక్షన్‌లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 2019-20లో తెలంగాణలో 2,84,954 సీ- సెక్షన్స్‌ జరిగాయి. అగ్రస్థానంలో పశ్చిమ బెంగాల్‌(4,26,969) నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(4,20,534), తమిళనాడు(3,48,923), ఉత్తరప్రదేశ్‌(3,00,868),  కర్ణాటక(2,88,329) రాష్ట్రాలు ఉన్నాయి. 


గతేడాది గంటకు 28 సీ సెక్షన్స్‌

తెలంగాణలో 2019 జనవరి 1 నుంచి మార్చి 5 వరకు అంటే 64 రోజుల్లో రాష్ట్రంలో 74,558 మంది జన్మిస్తే... అందులో సాధారణ ప్రసవాలు 30,030 మాత్రమే. మిగిలిన 44,523 సిజేరియన్‌ ప్రసవాలే.  ప్రతి రోజు సగటున 1,165 ప్రసవాలు జరిగితే,  సగటున గంటకు 48 మంది జన్మించారు. 1165 ప్రసవాల్లో  695 సిజేరియన్‌ ప్రసవాలే.  అంటే గంటకు సగటున 28 కడుపు కోతలు జరుగుతున్నాయి. 


ముహూర్తం చూసుకొని.. 

చాలామంది దంపతులు, వారి తల్లిదండ్రులు తమకు వంశాంకురం మంచి రోజునో, మంచి నక్షత్రమనో, లేదా ఫలానా రోజు పుట్టాలని, అలా జన్మిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. దాంతోనే ఆ రోజు, ఆ టైం రాగానే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టైం ప్రకారం కాన్పు చేయడానికి వీలుండదు. దీంతో ప్రజలు ప్రైవేటుకు క్యూ కట్టి మరీ కడుపు కోయించుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రులు అవసరం లేకపోయినా సిజేరియన్లు చేసేస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement