Abn logo
May 20 2020 @ 13:17PM

ఈ వార‌మే సౌతాఫ్రికా నుంచి తిరిగి రానున్న 150 మంది భారతీయులు

కెప్టౌన్: మ‌హ‌మ్మారి క‌రోనా సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల సౌతాఫ్రికాలోని కెప్టౌన్‌లో చిక్కుకుపోయిన 26 మంది భార‌త శాస్త్ర‌వేత్త‌లు ఈ వార‌మే తిరిగి స్వ‌దేశానికి రానున్నారు. ఈ శాస్త్ర‌వేత్త‌ల బృందం మూడు నెల‌ల కింద అంటార్కిటికా మిష‌న్‌పై వెళ్లి కోవిడ్ లాక్‌డౌన్ వ‌ల్ల సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయారు. శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌ నుంచి ముంబై, ఢిల్లీకి బయలుదేరే సౌతాఫ్రికా ఎయిర్‌వేస్ (ఎస్‌ఐఏ) విమానంలో స్వదేశానికి రానున్న150 మంది భారతీయ పౌరులలో ఈ 26 మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం ఇప్ప‌టికే సుమారు 1,000 మంది భారతీయ పౌరులు త‌మ పేర్లు నమోదు చేసుకున్నారని జోహన్నెస్‌బర్గ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ అంజు రంజన్ తెలిపారు.


దక్షిణాఫ్రికా హోం వ్యవహారాల శాఖ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ప్రయాణికులను భారత మిషన్ పరిశీలిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. "మేము వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్రాధాన్యత గల ప్రయాణీకులను ఎన్నుకోవలసి వచ్చిందని" రంజ‌న్ పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న భార‌త పౌరుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న‌ వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా తాము ఈ విమానంలో 150 మంది భార‌త పౌరుల‌ను త‌ర‌లిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. కాగా, సౌతాఫ్రికా ఎయిర్‌వేస్ (ఎస్‌ఐఏ) నిర్ణ‌యించిన విమాన చార్జీలు 15వేల‌ ర్యాండ్స్‌(రూ.62వేలు)ను ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని రంజ‌న్ చెప్పారు. కాగా, ఇది సాధార‌ణ విమాన చార్జీల‌కు మూడు రేట్లు.   

Advertisement
Advertisement
Advertisement