Abn logo
Apr 6 2020 @ 19:20PM

రెడ్‌జోన్లపై ప్రత్యేక దృష్టి సారించండి: అధికారులకు సీఎం ఆదేశం

  • ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో నాణ్యత పాటించాలని సూచన
  • రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 మర్కజ్‌కు సంబంధించినవేనని సీఎంకు తెలిపిన అధికారులు


అమరావతి: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కువమందికి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి సూచించారు. కరోనా వైరస్ స్థాయి, నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు ఉదయం వైద్యాధికారులందరితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి వైద్యాధికారులతో మాట్లాడుతూ క్వారంటైన్‌ సెంటర్లు, ఐసోలేషన్ వార్డుల్లో నాణ్యమైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వైద్య సిబ్బందికి వెంటనే వ్యక్తిగత రక్షక పరికరాలు, మాస్కులు అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


సమావేశానికి హాజరైన వైద్య, ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్-19 కేసులకు సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. దీని ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 266 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 243 మంది మర్కజ్‌కు హాజరైనవారు లేదా వారికి సన్నిహితంగా ఉన్నవారేనని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించారని, వారిలో ఎవరెవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలో డాక్టర్లు పరిశీలిస్తున్నారని జవహర్ రెడ్డి సీఎంకు వివరించారు. అంతేకాకుండా గుంటూరు, విశాఖపట్నం, కడప జిల్లాల్లో ఉన్న లాబోరేటరీల సంఖ్యను కూడా పెంచుతున్నామని, అంతేకాకుండా ఐసీఎంఆర్ అనుమతితో త్వరలో రాష్ట్రానికి అత్యాధునిక పరికరాలు రానున్నాయని, వాటి సాయంతో మరింత వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించగలమని రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement