Abn logo
Aug 7 2020 @ 03:20AM

2లక్షలకు చేరువలో

  • ఒకేరోజు 10,328 కేసులు నమోదు 
  • మరో 72 మంది వైరస్‌కు బలి 
  • 1,753కు పెరిగిన కరోనా మరణాలు 
  • ‘తూర్పు’లో వైసీపీ ఎమ్మెల్యేకి కొవిడ్‌ 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా కేసులు 2లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటికే 1,96,789 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. మరో 3,212 కేసులు నమోదయితే మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత రెండు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది. గురువారం ఒక్కరోజే 10,328 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా మరో 8,516 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,12,870 మంది డిశ్చార్జి అయ్యారు. గురువారం 72మంది కరోనా కాటుకు బలయ్యారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో పదిమంది చొప్పున, గుంటూరులో 9మంది, చిత్తూరులో 8మంది, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో నలుగురు, కడప, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాలు 1,753కు పెరిగాయి. 


అనపర్తి ఎమ్మెల్యేకు పాజిటివ్‌ 

తూర్పుగోదావరి జిల్లాలో మరో 1,351 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 27,580కు, కొవిడ్‌ మరణాలు 205కు చేరాయి. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి పాజిటివ్‌గా తేలింది. అమలాపురంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు(51) కొవిడ్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజల్లో యాంటీబాడీలు, కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ రేటు తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాకినాడలో సర్వే ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోని 3,750మంది నుంచి నమూనాలు సేకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరో 682మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,744కు చేరింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఈ జిల్లాలో కేసులు పదిలోపే కాగా, ఇప్పుడు ఏకంగా పదివేల మార్కుకు చేరువైంది. కర్నూలులో 1,285, అనంతపురంలో 1,112, చిత్తూరులో 1,027, గుంటూరులో 868, నెల్లూరులో 788, కడపలో 604, విజయనగరంలో 575, కృష్ణాజిల్లాలో 363, ప్రకాశం జిల్లాలో 348 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. 


కరోనా భయంతో మహిళ ఆత్మహత్య

అడుసుమల్లి(పర్చూరు), ఆగస్టు 6: కరోనా భయంతో ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని అడుసుమల్లికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పర్చూరులోని ఎంపీపీయూపీ పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అడుసుమల్లి గ్రామానికి చెందిన మహిళ(65)కు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడింది. డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు మృతురాలి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


యువకుడి బలవన్మరణం 

చేజర్ల, ఆగస్టు 6: కరోనా సోకిన ఓ యువకుడు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాడు. మరో పక్క అతడి భార్య, కుమారుడు క్వారంటైన్‌ కేంద్రంలో ఉండటంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు(27) జూలై 31న సంజీవిని వాహనం ద్వారా కరోనా టెస్టు చేయించుకున్నాడు. పాజిటివ్‌ రావడంతో అధికారులు నెల్లూరుకు తరలించారు. రెండు రోజుల అనంతరం హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని అతన్ని గ్రామానికి పంపారు. ఆదే రోజు అతడి భార్య, కుమారుడికి పాజిటివ్‌ రాగా వారిని ఆత్మకూరు క్వారైంటైన్‌ కేంద్రానికి తరలించారు. అతను ఇంట్లోనే ఉంటూ వారి గురించి ఆరాతీస్తూ మధన పడేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


సచివాలయంలో మరో 9మంది ఉద్యోగులకు పాజిటివ్‌ 

సచివాలయంలో కరోనా విలయం సృష్టిస్తోంది. తాజాగా మరో 9మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొదటి బ్లాక్‌లో విధులు నిర్వర్తించే ఇద్దరు సెక్షన్‌ అధికారులకు, రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖలో అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారికి, మూడో బ్లాక్‌లో యూత్‌ సర్వీసె్‌సలో పనిచేసే ఒక చిరుద్యోగికి, నాలుగో బ్లాక్‌లోని ఉన్నత విద్యాశాఖ, రెవెన్యూశాఖలోని సీఎంఆర్‌ఎఫ్‌ సెక్షన్‌లో ఇద్దరు చిరుద్యోగులకు, ఐదో బ్లాక్‌లో పంచాయతీరాజ్‌ శాఖ, సాధారణ పరిపాలనశాఖలో ఇద్దరు సెక్షన్‌ అధికారులకు, గృహ నిర్మాణ శాఖలో ఏఎ్‌సఓకి కొవిడ్‌ సోకింది. వీటితో కలిపి ఇప్పటి వరకు సచివాలయం(65), అసెంబ్లీ(25)లో మొత్తం కేసుల సంఖ్య 90కి చేరింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులతోపాటు భద్రతా సిబ్బందిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement