Abn logo
May 22 2020 @ 20:00PM

సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్‌కు మెగా బ్లడ్ బ్రదర్స్ రక్తదానం

ప్రసిద్ధ సినీ కవి సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య విషయమై రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అశోక్ తేజ కుటుంబ సభ్యులు ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే.. ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ వార్తలు పుట్టిస్తున్నారనే వార్తలు బుధవారం సాయంత్రం వినిపించింది. అయితే సుద్దాల అశోక్ తేజకే ఆరోగ్యం బాగా లేదని, ఆయనకి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగనున్నట్లుగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. దీనికోసమే బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి మెగా బ్లడ్ బ్రదర్స్ 15 మంది రక్తదానం చేయబోతున్నట్లుగా సంస్థ తెలిపింది. 


‘‘అక్షర శిల్పి, ప్రసిద్ధ సినీ కవి, జాతీయ స్థాయిలో తెలుగు పాటకు పట్టం కట్టిన సృజనశీలి, మరి ప్రత్యేకించి అత్యంత ఆత్మీయులైన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి (మే 23, 2020) ఉదయం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగబోతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జరగబోయే ఈ ఆపరేషన్లో భాగంగా అవసరమైన రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు చెందిన 15 మంది రక్తదాతలు ఆ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. వేసవి వేడిమి, కరోనా లాక్ డౌన్ లను సైతం పట్టించుకోకుండా ఈ మహత్తర కార్యానికి నడుం బిగించిన ప్రతి ఒక్క రక్తదాతకు మనఃపూర్వక ఆత్మీయతాభినందనలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ చిరంజీవి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలితమో... ఈ జన్మలో ఇంతమంది చేరువై...  పిలిచినది తడవుగా స్పందిస్తున్న మెగా బ్లడ్ బ్రదర్స్ అందరినీ, వారి కుటుంబాల్ని చల్లగా చూడాలని ఆ దేవదేవుణ్ణి  వేడుకుంటున్నాము..’’ అని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Advertisement
Advertisement
Advertisement