Abn logo
Sep 15 2021 @ 04:43AM

తెలంగాణలో 12% పెరిగిన నేరాలు

  • ఐదుగురు మహిళలపై యాసిడ్‌ దాడులు..
  • ‘నిర్లక్ష్య’ మరణాల సంఖ్య 7,564
  • గత ఏడాది మొత్తం 827 మంది హత్య
  • 2,074 పోక్సో కేసులు.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నేరాలు 12% మేర పెరిగాయి. 2019తో పోలిస్తే.. 2020లో నేరాల రేటు పైకి ఎగబాకింది. 2020లో రాష్ట్రవ్యాప్తంగా 1,47,501 నేరాలు సంభవించాయి. 2018లో 1,26,858 నేరాలు నమోదవ్వగా.. 2019లో కొంత పెరిగి.. 1,31,254 నేరాలు చోటుచేసుకున్నాయి. అటు చార్జ్‌షీట్‌ల నమోదు శాతం 83.7గా ఉంది. నేషనల్‌ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) మంగళవారం ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా-2020’ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి లక్ష మందికి 393 కేసులు నమోదవుతున్నాయి. 802 హత్యకేసుల్లో 827 మంది హత్యకు గురయ్యారు. అంటే.. ప్రతి లక్ష మందిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. నిర్లక్ష్యం కారణంగా 7,564 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి లక్ష మందికి 18 మందిని నిర్లక్ష్యం బలిగొంటోందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది. 6,288 రోడ్డు ప్రమాదాల్లో 7,226 మంది మరణించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులు 1,332 నమోదవగా.. ఈ కేటగిరీలో 1,365 మంది మృత్యువాత పడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల 16 మంది రోగులు మృతిచెందారు. ఐదుగురు మహిళలు యాసిడ్‌ దాడికి గురయ్యారు. పని ప్రదేశాల్లో 18 మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు.


12 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం, వదంతులను సృష్టించడంపై 273 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు పోక్సో చట్టం కింద 2,074 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 117 కేసులు, గ్యాబ్లింగ్‌కు సంబంధించి 2,643 కేసులు బుక్‌ అయ్యాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా ఐపీసీ నేరాలు పెరిగాయి. 2018లో 14,332.. 2019లో 15,333 నేరాలు సంభవించగా.. 2020లో 15,978 నేరాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు రాజద్రోహ కేసులు, 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులు 65 నమోదయ్యాయి. కల్తీ ఆహార పదర్థాలకు సంబంధించి అధికారులు 1,498 కేసులు పెట్టారు.