Abn logo
Sep 27 2021 @ 01:09AM

అహుడాలో 1036 అక్రమ లేఔట్లు

కస్టమర్లను బురిడీ కొడుతున్నది ఈ ఎల్‌పీ నెంబర్‌తోనే...

విచ్చలవిడిగా...

అహుడాలో 1036 అక్రమ లేఔట్లు

అనుమతుల్లేకపోయినా ప్లాట్ల విక్రయాలు

ఒక్కో ప్లాట్‌ రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు

ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే అమ్మకాలు

అరవకూరులో వైసీపీ నేత అండతో లేఔట్‌

కమ్మూరులో 15 ఎకరాల్లో 80 ప్లాట్లపై అగ్రిమెంట్‌ పూర్తి 

జిల్లాకేంద్రం సమీపంలోనే  300కుపైగా అనధికార లేఔట్లు

ధర్మవరం, రాప్తాడు, హిందూపురం పరిధిలో వందల సంఖ్యలో...

ఉదాసీనంగా అహుడా అధికారులు

అనంతపురం కార్పొరేషన, సెప్టెంబరు 26:  అనం తపురం-హిందూపురం అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ (అహుడా) పరిధి పెరిగే కొద్దీ అక్రమ లేఔట్లు అధికమవుతున్నాయి. వాస్తవానికి అహుడా అనుమతి పొందాలంటే చాలా తతంగమే ఉంటుంది. కానీ అహుడా అనుమతుల్లేకుండానే లేఔట్లు వేసి అందులో ప్లాట్లు విక్రయిస్తున్నారు. కొందరైతే పైసా పెట్టుబడి లేకుండా భూమిని కొని (టోకెన పేరుతో) ఎక్కువ ధరకు ప్లాట్లు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. అహుడాను 2017లో ఏర్పాటు చేశారు. ఈ నాలుగేళ్ల వ్యవధిలో అహుడా పరిధిలో లెక్కకు మించి అక్రమ లేఔట్లు వెలిశాయనే ఆరోపణలున్నాయి. అధికా రులే 1036 అక్రమ లేఔట్లు వెలిసినట్లు గుర్తించారు. ఇంకా వారి దృష్టిలో పడని వెంచర్లు ఎన్నున్నాయో...?. వందల ఎకరాల్లో అనుమతుల్లేకుండా లేఔట్లు వేశారని తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆరోపించడం గమనార్హం. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు, ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల పరిధిలో లేఔట్లు ఇష్టారాజ్యంగా వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం నగరం నుంచి ఉరవకొండమీదుగా విడపనకల్లు వరకు వందల సంఖ్యలో లేఔట్లు వెలిశాయంటే ప్లాట్ల విక్రయాలతో ఎంత మంది సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో అర్థమవుతుంది. ఒక్కో ప్లాట్‌ను ఆ భూమి ధర ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విక్రయించి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. 


అనుమతే లేకున్నా స్పాట్‌ రిజిస్ర్టేషన పేరుతో బురిడీ !

కూడేరు మండలం కమ్మూరు వద్ద అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఓ లేఔట్‌ వెలిసింది.  సర్వే నెంబరు 505. ఇందులో 15 ఎకరాల్లో ఓ బిల్డర్‌ లిల్లీగార్డెన పేరుతో లేఔట్లు వేశాడు. దీనికి అహుడా అనుమతుల్లేవు. అందులో ప్లాట్లు విక్రయానికి ఉన్నట్లు ఆనలైనలోనూ, నోటి మాటల ద్వారా ప్రచారం కల్పించాడు. మూడు సెంట్లతో ఒక ప్లాట్‌ చొప్పున విక్రయిస్తున్నారు. స్పాట్‌ రిజిస్ర్టేషన చేసుకుంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు తగ్గిస్తామని నమ్మబలుకుతారు. అహుడా అనుమతే లేకపోతే రిజిస్ర్టేషన ఎలా చేస్తారో మరి...? అక్కడున్న ఓ కాపీలో ఇప్పటికే 80 ప్లాట్లు అగ్రిమెంట్లు పూర్తయినట్లు సమాచారం. కానీ ఆ 15 ఎకరాలలో ఒక్క సెంటు కూడా కన్వర్షన కాలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అహుడా అనుమతితో పాటు  లేఅవుట్‌ ప్లాన(ఎల్‌పీ) నెంబర్‌ రాకపోయినా వచ్చిందని చూపుతూ విక్రయిస్తున్నారు. అనుమతి లేకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోకముందే  త్వరగా  అమ్మేయాలనే నెపంతో కొన్ని ప్లాట్లను రూ.6 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షలు.. ఇలా అమ్మేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఆ అమ్మకాలతో రూ.3 కోట్లు జేబులోకి వేసుకున్నట్లు సమాచారం. 


వైసీపీ నేత అండతో....

కూడేరు మండలం అరవకూరులో సర్వేనెంబరు 537/1, 538/1లో దాదాపు 17.5 ఎకరాల్లో లేఔట్లు వేశారు. ఇది అనధికార లేఔట్‌గా పరిగణిస్తున్నట్లు అహుడా అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల 40 అడుగుల రోడ్డు కూడా లేదు. ఇక్కడ ఓ అధికార పార్టీ నేత అండతోనే విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. అహుడాకు చెల్లించాల్సిన ఫీజులు ముడుపుల రూపంలో ఆ నేతకు వెళ్లినట్లు తెలిసింది. ఇలా అధికార పార్టీ నేతల అండతో అక్రమ లేఔట్లు అధికమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే అమ్మకాలు...

ఎక్కడైనా వ్యవసాయ భూమి కమర్షియల్‌గా మార్చాలంటే ఇళ్ల నిర్మాణాలకు, ప్లాట్లు, అమ్మకాలకు, పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు తదితర వాటికి కన్వర్షన ప్రక్రియ తప్పనిసరి.  ల్యాండ్‌ కన్వర్షన తరువాత అహుడాకు దర ఖాస్తు చేసుకోవాలి.  సైట్‌ ఫొటోలు, ఎఫ్‌ఎంబీ స్కెచ మొదలుకొని 15 డాక్యుమెంట్లను అందజేయాలి. అన్నింటిని పరిశీలించాకే అహుడా అనుమతి ఇవ్వడంతో పాటు ఎల్‌పీ నెంబరు ఇస్తారు. కానీ ఇవన్నీ లేకుండానే అక్కడ ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. 2019లో అప్పటి అహుడా చైర్మన అంబికా లక్ష్మీనారాయణ పరిశీలనలో అహుడా పరిధిలో 2800 అక్రమ లేఔట్లు వేసినట్లు గుర్తించారట. ఆ తరువాత కొన్నింటికి అనుమతులు తెచ్చుకున్నారు. 


అన్నింటా అక్రమాలే....

అనంతపురం చుట్టపక్కల ప్రాంతాల్లోనే 300కుపైగా అక్రమ లేఔట్లు వెలిశాయంటే రియల్‌ ఎస్టేట్‌ పేరుతో ఎంత దోపిడీ జరుగుతోందో అర్థమవుతోంది. హిందూపురం పరిధిలోని శ్రీకంఠపురం సర్వేనెంబరు 266, 267, 271-పార్ట్‌ 272లో 22.80 ఎకరాల్లో అక్రమ లేఔట్‌ వేసినట్లు గుర్తించారు. ధర్మవరం, రాప్తాడు, హిందూపురం పరిధిలో వందల సంఖ్యలో లేఔట్లు వెలిశాయి. ఇటు విడపనకల్లు వరకు అదే పరిస్థితి. అనంతపురం సమీపంలోని పంగల్‌రోడ్డు వద్ద ఉన్న జంగాలపల్లి సర్వేనెంబరు -14లో 9 ఎకరాల్లో వేసిన లేఔట్‌ అనధికార లేఔట్ల జాబితాలో ఉంది. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లిలో సర్వేనెంబరు-282లో 11.82 ఎకరాల్లో అక్రమ లే ఔట్‌ వెలిసింది. ధర్మవరం నియోజకవర్గంలోని కుణుతూరులో సర్వే నెంబరు-406లో 7 ఎకరాలలో వేసిన  లేఔట్‌ అనధికారికమైనదిగా గుర్తించారు. 


చోద్యం చూస్తున్న అహుడా అధికారులు...

ప్రధాన రహదారి పక్కనే అనుమతి లేకుండా లేఔట్లు వెలుస్తుంటే అహుడా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేఔట్లు నుంచి అహుడాకు ఆదాయం కూడా దక్కకుండా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. అధికారులు ఇలా చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 


అక్రమ లేఔట్‌ వెలిస్తే చర్యలే 

అహుడా పరిధిలో అనుమతుల్లేకుండా లేఔట్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు. అనధికార లేఔట్లను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. 

- మురళీకృష్ణగౌడ్‌, అహుడా వైస్‌ చైర్మన

లేఔట్‌ ప్లానలో అగ్రిమెంట్‌ అయిన ప్లాట్లు(పసుపు రంగు కలర్‌లో)


ప్లాట్ల విక్రయాలు జరుగుతోంది కమ్మూరులోని ఈ భూమిలోనే