Abn logo
Sep 15 2021 @ 02:28AM

పట్టిస్తే 10 లక్షలు

  • బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ రాజు ఆచూకీ తెలిపినవారికి రివార్డు
  • సీపీ అంజనీకుమార్‌ వెల్లడి
  • నిందితుడి కోసం ముమ్మర గాలింపు
  • 6 రోజులైనా పట్టుకోలేకపోవడంపై  పలు అనుమానాలు
  • బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ రాజు ఆచూకీ తెలిపినవారికి రివార్డు ఇస్తామన్న పోలీసులు
  • సీపీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం
  • నిందితుణ్ని పట్టుకోవడానికి ముమ్మర గాలింపు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లపాపపై హత్యాచారం కేసు నిందితుడు పల్లకొండ రాజు కోసం గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. అతణ్ని రహస్యంగా ఉంచడంలో ఎవరో సహకరిస్తున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు, టాస్క్‌ఫోర్స్‌, ఇతర దర్యాప్తు బృందాలతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సమావేశమయ్యారు. నిందితుని ఆచూకీ చెప్పి రాజు అరెస్టుకు సహకరించిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు సీపీ ప్రకటించారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఇంత ఘోరానికి పాల్పడిన నిందితుణ్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరగడం.. మరోవైపు నిందితుడు చిక్కకపోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులకు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో నిందితుణ్ని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు మరిన్ని వ్యూహాలు సిద్ధం చేశారు. సీపీ సమావేశానికి హాజరైన తూర్పు మండలం డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీతో పాటు పలువురు అధికారులు నిందితున్ని పట్టుకునేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలు ఆరు రోజులుగా గాలిస్తున్నా నిందితుని ఆచూకీ గుర్తించలేకపోయాయి. దీంతో తాజాగా మరిన్ని బృందాలను నియోగించి గాలింపును తీవ్రతరం చేస్తున్నట్లు సమాచారం. నిందితుడు సెల్‌ఫోన్‌ వాడకపోయినా అతని సన్నిహితులు, బంధువులకు ఫోన్‌ చేసి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా నిందితుడు ఇప్పటిదాకా చిక్కలేదని పోలీసులు ప్రకటించడం.. నిందితుణ్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం.. రాజును ఎన్‌కౌంటర్‌ చేస్తామని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించడంతో అసలేం జరుగుతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి.


ఎందుకంటే.. రాజధాని నగరం మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల సీసీ కెమెరాలున్నాయి. ఎలాంటి నేరగాడినైనా ఇట్టే పట్టేస్తామని చెప్పే అధికారులు ఈ కేసులో నిందితుణ్ని పట్టుకోలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. రాజు తప్పించుకున్న ఫొటోను ఇప్పటికే వైరల్‌ చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీలో అతడు ఎక్కడ చిక్కాడో అక్కడి నుంచి ఫాలో కాలేదా? నిజంగానే పట్టుకోలేదా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.


హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపిన ప్రకారం నిందితుడి వివరాలివి..

పేరు: పల్లకొండ రాజు

వయస్సు: 30

ఎత్తు: 5.9 అడుగులు

రబ్బర్‌ బ్యాండ్‌తో కట్టిన పొడవైన వెంట్రుకలు, తలకు టోపీ, ఎరుపు రంగు స్కార్ఫ్‌ కట్టి ఉన్నాడు. రెండు చేతులపై మౌనిక అని రాసి ఉన్న పచ్చబొట్లు ఉన్నాయి. చిన్న గడ్డం ఉంది. మద్యం సేవించి బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటాడు.

ఆచూకీ తెలిస్తే ఈ నంబర్‌కు కాల్‌ చెయ్యండి

ఈస్ట్‌జోన్‌ డీసీపీ 9490616366

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ 9490616627