Abn logo
May 9 2021 @ 00:30AM

కరోనా కట్టడి చేయండి

 కక్ష సాధింపులు విడనాడి.. వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలి : టీడీపీ నాయకుల నిరసన 

 తాడేపల్లిగూడెం, మే 8(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకుని కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి హితవు పలికారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలంటూ శనివారం పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టా రు. మోకాళ్లపై కూర్చుని నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో  సంగం డెయిరీ, అమర్‌ రాజా, జువ్వారి కంపెనీలపై కక్ష సాధింపులకోసం ప్రభుత్వం  చూపిన శ్రద్ధ.. కరోనా నియంత్రణపై లేదని బాబ్జి తూర్పార బట్టారు. మంత్రి మండలి అజెండాలో కరోనా, వ్యాక్సిన్‌ను 33వ అంశంగా పెట్టినప్పుడే ప్రభుత్వం శ్రద్ధ ఏపాటిదో అర్ధమవుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి విడనాడి వ్యాక్సిన్‌పై దృష్టి పెట్టాలని తెలుగుదేశం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల ఽశ్రీధర్‌, పార్లమెంటరీ రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, నాయకులు కిలపర్తి వెంకట్రావు, పరిమిరవికుమార్‌ డిమాండ్‌ చేశారు. 

పెంటపాడులో నిరసన..

పెంటపాడు, మే, 8 : పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్‌ వ్యాక్సిన్‌లు ప్రభుత్వం అందజేయాలని టీడీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు శనివారం మండలంలోని ఆయా గ్రామాలలో టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్ద నిరసన తెలిపారు. కొవిడ్‌ రోగులకు ఆసుపత్రుల్లో కావాల్సిన బెడ్లు ఏర్పాటు చేయాలని, మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందజేయాలన్నారు. నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి,  ఏపీ బీసీ చైతన్య సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరి చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

కొవిడ్‌ కట్టడిలో ప్రభుత్వం విఫలం : గన్ని 

భీమడోలు, మే 8 : కొవిడ్‌ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. దీనికి నిరసనగా భీమడోలు క్యాంపు కార్యాలయంలో ప్లకార్డులు చేపబట్టి శనివారం నిరసన తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ ఒక రోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ నిర్లక్ష్యం, అసమర్థతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోందని, వైరస్‌ కట్టడిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టకుండా ప్రతి పక్షాన్ని అణిచివేయడం, వేధించడంపైనే శ్రద్ధ చూపడం కరోనాను మించిన విషాదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్టదా అని ప్రశ్నించారు. కరోనా మృతుల  కుటుంబాలకు చంద్రన్న బీమా ఉంటే పది లక్షల పరిహారం వచ్చి ఉండేదన్నారు. 18 నుంచి 45 ఏళ్ల యువతకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జగన్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఉంగుటూరు మండలం నాచుకుంటలో టీడీపీ నేత ఇమ్మణి గంగాధరరావు కరోనా వైఫల్యంపై ప్లకార్డులు పట్టి ఒక రోజు దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 

అందరికీ వ్యాక్సిన్‌ అందించాలి : ఆరిమిల్లి

తణుకు, మే 8: అందరికీ వ్యాక్సిన్‌ అందించాలని, జగన్మోహన్‌రెడ్డి నిర్లక్ష్యం, అసమర్థత పాలన వల్ల రాష్ట్ర ప్రజలు నరకయాతన పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కబలించి వేస్తున్నా వైరస్‌ కట్టడిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఆసుపత్రులలో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ కొరత, భోజన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్లకు వ్యాక్సిన్‌ ఉచితంగా వేయిస్తామని చెప్పి ఇప్పుడు మడమ తిప్పుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అవసరమైతే 13 లక్షల వ్యాక్సిన్లను మాత్రమే కొనాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగుల కోసం రూ. 2,500 కోట్లు ప్రజాధనం వృథా చేశారన్నారు. కాని ప్రజల ప్రాణాలకు అవసరమైన వ్యాక్సిన్‌ కొనడానికి కేవలం రూ. 45 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. 

గన్ని వీరాంజనేయులు దీక్ష


Advertisement